పెట్రోల్ బంక్ కి వెళ్లినప్పుడు అక్కడ రెండు రకాల పెట్రోల్ లు కనిపిస్తాయి. ఒకటి నార్మల్ పెట్రోల్ అయితే మరొకటి ప్రీమియం పెట్రోల్. దీని ధర కూడా నాలుగైదు రూపాయలు ఎక్కువ ఉంటుంది. ఈ ప్రీమియం పెట్రోల్ కొట్టిస్తే మైలేజ్ ఎక్కువ వస్తుందని, బండి పెర్ఫామెన్స్ బాగుంటుందని అనుకుంటారు చాలామంది. అయితే అసలు అందులో నిజమెంత? ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశంలో BS6 ప్రమాణాలు అమలు చేయబడినప్పటి నుంచి పెట్రోల్ నాణ్యత కాస్త మెరుగుపడింది. అయితే పెట్రోల్ బంకుల్లో కనిపించే పవర్ పెట్రోల్ అంతకంటే నాణ్యమైనది గా చెప్పుకోవచ్చు. ఇందులో ఇథనాలు తక్కువగా ఉండి ఆక్టేన్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఇది మరింత బెటర్ గా ఇంజిన్ లో బర్న్ అవుతుంది. వీటిని లగ్జరీ కార్లు, హై ఎండ్ బైక్స్ కోసం రూపొందిస్తారు. అందుకే దీని ధర కాస్త ఎక్కువ ఉంటుంది. అయితే ఇది నిజంగా బండి పెర్ఫామెన్స్ ను ఇంప్రూవ్ చేస్తుందా?
తేడా ఏంటి?
పవర్ పెట్రోల్ వల్ల ఇంజిన్ మరింత క్లీన్ గా ఉంటుందన్న మాట వాస్తవమే. అయితే సాధారణ బైకులు, కార్లకు దీని వల్ల పెద్ద ప్రయోజనం లేదనే చెప్పాలి. ఎందుకంటే.. ప్రీమియం పెట్రోల్ వల్ల ఇంజిన్ కొద్దిగా సున్నితంగా నడుస్తుంది. కొన్ని ఎక్స్ ట్రా క్లీనింగ్ ఏజెంట్లను కలిగి ఉంటుంది. మీరు ప్రతిసారీ ప్రీమియం పెట్రోల్ కొట్టిస్తుంటే ఓకే. కానీ, ఒకసారి మామూలు పెట్రోల్ మరోసారి పవర్ పెట్రోల్ కొట్టించడం వల్ల పెద్దగా లాభం ఉండదు. అయితే ఎక్కువ సీసీ ఇంజిన్లు, ప్రీమియం కార్లుకి ఇది కొంత మేలు చేసేఅవకాశం ఉంది.
మీ బండికి ఏ పెట్రోల్ మంచిది?
మీ దగ్గర 2020 తర్వాత తయారు చేయబడిన బండి ఉంటే మీరు సాధారణ పెట్రోల్ ను వాడినా నష్టం ఏమీ ఉండదు. ఒకవేళ మీ దగ్గర స్పోర్ట్స్ కారు లేదా వింటేజ్ మోడల్ కారు లేదా బైక్ వంటివి ఉన్నట్టయితే వాటిని మరింత ఎక్కువ కాలం వచ్చేలా పవర్ పెట్రోల్ వాడొచ్చు. పవర్ పెట్రోల్ ఇంజిన్ తుప్పు పట్టకుండా కాపాడుతుంది. పెర్ఫామెన్స్ ను కూడా పెంచుతుంది. కాబట్టి ప్రీమియం వెహికల్స్ ను అది సరిపోతుంది.