పింక్ ఉప్పు, కల్లు ఉప్పు ఆరోగ్యకరంగా అనిపించినా.. వీటిలో అయోడిన్ తక్కువగా ఉండటం శరీరానికి పెద్ద నష్టం కలిగించవచ్చు. థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి అయోడిన్ అవసరం. కాబట్టి ఆరోగ్య రీత్యా అయోడిన్ కలిపిన తెల్ల ఉప్పును వాడడం ఎంతో ముఖ్యం.
ప్రస్తుత రోజుల్లో చాలా మంది వంటల్లో అయోడిన్ కలిపిన ఉప్పు బదులుగా హిమాలయ పింక్ ఉప్పు, కల్లు ఉప్పు వాడుతున్నారు. రుచి, రంగు వేరుగా ఉండటం వల్ల ఈ ఉప్పులు బాగా వాడుకలోకి వస్తున్నా.. వాటిలో అయోడిన్ తక్కువగా ఉండటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడంలో సమస్యలు వస్తున్నాయి. అయోడిన్ లేకపోవడం వల్ల ముఖ్యంగా థైరాయిడ్ సంబంధిత అనారోగ్యాలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అయోడిన్ అంటే ఏంటి..?
మన శరీరంలో చాలా ముఖ్యమైన సూక్ష్మ ఖనిజం అయోడిన్. ఇది మన థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేసేలా చూస్తుంది. అయోడిన్ లేకపోతే.. గొంతు పెద్దగా వాచడం, హార్మోన్ల సమతుల్యత లోపించడం, గర్భిణీ స్త్రీల శిశువు మెదడు అభివృద్ధిలో సమస్యలు లాంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
తెల్ల ఉప్పు ప్రత్యేకత
మార్కెట్ లో దొరికే సాధారణ తెల్ల ఉప్పు, అయోడిన్ తో కలిపి ఉంటుంది. దీనిలో ఉండే అయోడిన్ శాతం శరీరానికి అవసరమైన స్థాయిలో ఉంటుంది. అందుకే ఈ ఉప్పును వాడటం వల్ల మనం రోజువారీ అయోడిన్ ను తీసుకోవచ్చు.
థైరాయిడ్ సమస్యలు వచ్చే ప్రమాదం
అయోడిన్ ఉన్న తెల్ల ఉప్పును పూర్తిగా మానేసి.. కేవలం పింక్ ఉప్పు లేదా కల్లు ఉప్పు వాడుతున్న వారిలో థైరాయిడ్ సమస్యలు ఎదురవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల అయోడిన్ కలిపిన తెల్ల ఉప్పును పూర్తిగా వదిలేయకుండా తగినంత వాడటం ఆరోగ్యానికి మంచిది.
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇలాంటి కల్లు, పింక్ ఉప్పుల్లో ఇతర ఖనిజాలు ఉండవచ్చు కానీ అయోడిన్ తక్కువగా ఉంటుంది. అందుకే ఇవి ఒక్కటే ఆధారం కాకుండా.. అయోడిన్ ఉన్న ఉప్పు కూడా వాడాలి.
భారత ప్రభుత్వం స్థాపించిన ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (FSSAI) ప్రకారం.. మనం వాడే ఉప్పులో కనీసం 15 ppm (పార్ట్స్ పర్ మిలియన్) అయోడిన్ ఉండాలి. అయోడిన్ కలిపిన ఉప్పు వాడటం తప్పనిసరిగా మారింది.
అయోడిన్ లోపం వల్ల వచ్చే సమస్యలు
థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గిపోవడం
గొంతు పెరిగి వెడల్పు అవ్వడం
గర్భిణీ స్త్రీల్లో శిశువు మెదడు అభివృద్ధికి ఆటంకం
అయోడిన్ అవసరాన్ని ఎలా తీర్చుకోవాలి..?
వంటలో ప్రధానంగా అయోడిన్ కలిపిన తెల్ల ఉప్పును ఉపయోగించడం ఉత్తమం.
సలాడ్ లు, పచ్చడి లాంటి వాటిలో మాత్రమే కొద్దిగా పింక్ ఉప్పు లేదా కల్లు ఉప్పు ఉపయోగించవచ్చు.
ప్యాక్ చేసిన ఫుడ్స్, స్నాక్స్ లో ఉప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వాటిని తగ్గించాలని సూచిస్తున్నారు.
గర్భిణీ స్త్రీలు, థైరాయిడ్ సంబంధిత మందులు తీసుకునే వారు తప్పకుండా అయోడిన్ కలిపిన ఉప్పు వాడాలి.
మన ఆరోగ్యానికి ముందు ప్రాధాన్యత ఇచ్చి రుచి కోసం శరీరానికి అవసరమైన ఖనిజాలను వదులుకోకూడదు. అయోడిన్ తగినంత వాడుతూ దాని పూర్తి ప్రయోజనాలను పొందడం చాలా అవసరం. కల్లు ఉప్పు, పింక్ ఉప్పు లాంటి కొత్త ఉప్పులను పూర్తిగా మానేయడం సరికాదు. వాటిని సరైన పరిమాణంలో మాత్రమే వాడాలి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)