తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లకు ప్రాధాన్యతతో పెరుగుతున్న నేపథ్యంలో రైళ్ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వందేభారత్ రైళ్లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇప్పటికే కోచ్‌ల సంఖ్యను పెంచేందుకు నిర్ణయం తీసుకున్న రైల్వే శాఖ.. తాజాగా సికింద్రాబాద్ – విశాఖ వందేభారత్ స్టాపేజీల విషయంలో మరో నిర్ణయం తీసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి సికింద్రాబాద్ – విశాఖ మధ్య ప్రారంభమైన వందేభారత్ రైలుకు ప్రజాధరణ పెరగడంతో ఇటీవలే ఈ ట్రైన్‌లో కోచ్‌లను పెంచుతూ రైల్వేశాఖ అప్‌గ్రేడ్ చేసింది. ఈ వందేభారత్ ట్రైన్ ప్రారంభం సమయంలో 16 కోచ్ లతో ప్రయాణికులకు అందుబాటులో ఉండగా.. తాజాగా పెరిగిన డిమాండ్‌తో వీటి కోచ్‌లను రైల్వేశాఖ 20కి పెంచింది. కోచ్‌లు పెంచడం ద్వారా వెయిటింగ్ లిస్టులో ఉంటున్న ఈ రైలు ప్రయాణీకులకు వెసులుబాటు కలుగుతుంది. అయితే ఈ వందేభారత్ రైళ్లలో ప్రయాణించేందుకు ప్రయాణికులు అసక్తి చూపుతుండడంతో వారికి మరింత సౌకర్యాన్ని అందించేందుకు.. ప్రయాణికుల సంఖ్యను మరింత పెంచేందుకు సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందేభారత్ రైళ్లకు అదనపు స్టాపేజీలను యాడ్ చేస్తూ ఇటీవలే సదుపాయాన్ని కల్పించిన రైల్వే శాఖ తాజా వీటిపై మరో నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు వందేభారత్ అదనపు స్టాపేజీల సదుపాయాన్ని మరో ఆరునెలల వరకు పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే 20707/20708 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఏలూరు వద్ద కల్పించిన అదనపు స్టాపేజీ సదుపాయం గడువు వచ్చే నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ గడువును మరో ఆరు నెలల పాటు పొడగిస్తున్నట్టు పేర్కొంది. దీనితో పాటు 20833/20834 నెంబర్ గల వందేభారత్ ఎక్ స్‌ప్రెస్ రైళ్లకు సామర్లకోట వద్ద కల్పించిన అదనపు స్టాపేజీల సదుపాయాన్ని కూడా ఆరునెలల పాటు పెంచుతున్నట్టు తెలిపింది.
ఇదిలా ఉండగా వందేభారత్‌లో స్లీపర్ సర్వీసులకు కూడా ప్రారంభించేందుకు ఇండియన్ రైల్వేస్ కసరత్తు చేస్తోంది. వీటి తయారీ పూర్తయితే తొలి విడతలో తెలుగు రాష్ట్రాలకు మూడు-నాలుగు మార్గాల్లో వందేభారత్ స్లీపర్ కేటాయించాలని రైల్వేశాఖ గతంలోనే నిర్ణయం తీసుకుంది.