అమెరికాకు కోలుకోలేని దెబ్బ.. F-35 యుద్ధ విమానాలను కొనుగోలుకు భారత్ నిరాకరణ

అమెరికాకు కోలుకోలేని దెబ్బ.. F-35 యుద్ధ విమానాలను కొనుగోలుకు భారత్ నిరాకరణ

ట్రంప్‌ దెబ్బ మామూలుగా పడలేదు. భారత్‌పై కనికరం లేకుండా 25శాతం సుంకాలని వేశారు. భారత్‌ పాక్‌ యుద్ధాన్ని ఆపేశాను.. అవన్నీ ట్రేడ్‌ డీల్స్‌ బెదిరింపులతోనే అంటూ గప్పాలు కొట్టుకున్న అమెరికా అధ్యక్షుడు.. ఇప్పుడు భారత్‌ను దొంగదెబ్బతీశారు. 25శాతం సుంకాలతోపాటు.. బయటకు చెప్పని పెనాల్టీ కూడా విధించారు. రష్యాతో భారత్ వాణిజ్యం చేస్తున్న కారణంగానే పెనాల్టీ విధిస్తున్నట్లు ప్రకటించారు. అంటే 25శాతం ప్లస్‌ పెనాల్టీ అంటే అది ఎంత శాతానికి చేరుతుందో ఇప్పడే బయటపడే విషయం కాదు.

భారత్‌పై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌ టారిఫ్‌ల పిడుగు వేశారు. పాతిక శాతం సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి అనేక కారణాలు చెబుతున్నా.. అక్కసుతోనే ఈ టారిఫ్‌లు వేశారన్నది సుస్పష్టం. బ్రిక్స్‌లో భాగమైనందుకు, రష్యా ఆయిల్‌ కొంటున్నందుకు, తమ వస్తువులపై ఎక్కువ పన్నులు వేస్తున్నందుకు ఇలా అనేక విషయాలను మనసులో పెట్టుకుని ట్రంప్‌ భారత్‌పై పిడుగులాంటి టారిఫ్‌ను సంధించారు. ఇది ప్యూర్‌ మైండ్‌గేమ్‌తో తీసుకున్న డెసిషన్‌. దీంతో భారత్‌లో పొలిటికల్‌ దుమారం కూడా చెలరేగింది.

ఈ క్రమంలోనే వాణిజ్య ఒప్పందం గురించి భారత్-అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఈలోగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 7 నుండి ఈ సుంకాలు అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలోనే భారతదేశం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నివేదిక ప్రకారం, అమెరికాకు F-35 యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి భారత్ నిరాకరించింది.

అమెరికన్ ఉత్పత్తుల కొనుగోలును వేగవంతం చేయాలని భారత ప్రభుత్వం ఆలోచిస్తున్నప్పటికీ, అమెరికా నుండి అదనపు రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం లేదని అధికారులను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్ తన కథనంలో పేర్కొంది. బ్లూమ్‌బెర్గ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, F-35 స్టీల్త్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ కొనుగోలుపై ఆసక్తి లేదని భారత్ అమెరికాకు తెలియజేసిందని పేర్కొంది.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 2025లో అమెరికాను సందర్శించారు. వైట్ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిశారు. ఈ సందర్భంగా, ట్రంప్ భారతదేశానికి F-35 యుద్ధ విమానాలను విక్రయించడానికి ముందుకొచ్చారు. అయితే దేశీయంగా రక్షణ పరికరాల ఉమ్మడి రూపకల్పన, తయారీపై దృష్టి సారించిన భాగస్వామ్యాలపై భారత ప్రభుత్వం ఎక్కువ ఆసక్తి చూపుతుందని అధికారులు తెలిపారు. దీనిపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఇంకా స్పందించలేదు.

ఆగస్టు 1 నుండి భారతదేశం నుండి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 శాతం సుంకాన్ని ప్రకటించారు. రష్యా నుండి దిగుమతులకు శిక్షాత్మక చర్యగా భారతదేశంపై జరిమానాను కూడా విధించారు. ఇది 25 శాతం సుంకం నుండి వేరుగా ఉంటుంది. భారతదేశం సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నందున అమెరికా భారతదేశంతో సాపేక్షంగా తక్కువ వాణిజ్యం చేసిందని ట్రంప్ భావిస్తున్నారు.

భారతదేశంపై డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించిన తర్వాత, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ పార్లమెంటులో ఒక ప్రకటన చేశారు. సుంకాల ప్రభావాలను అంచనా వేస్తున్నామని, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడానికి, ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పియూష్ గోయల్ అన్నారు. రైతులు, కార్మికులు, వ్యవస్థాపకులు, ఎగుమతిదారులు, MSMEలు, పరిశ్రమలోని అన్ని వాటాదారుల రక్షణ, ప్రోత్సాహానికి మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యతనిస్తుందని పియూష్ గోయల్ పార్లమెంటులో స్పష్టం చేశారు.

Please follow and like us:
బిజినెస్ వార్తలు