హైదరాబాద్‌లో నల్లాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టబోతోంది జలమండలి. మోటార్ల ద్వారా నల్లా నీటిని తోడేస్తున్న తోడేళ్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మోటార్ ఫ్రీ టాప్ వాటరే లక్ష్యంగా రంగంలోకి దిగబోతున్నాయి ప్రత్యేక బృందాలు. నల్లాకు మోటార్లు బిగించి నీటిని తోడుతున్నట్టు తేలితే.. మొత్తంగా కనెక్షన్ కట్‌చేసి.. ఐదువేల రూపాయలు జరిమానా విధించనున్నారు.
హైదరాబాద్‌లో నల్లాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టబోతోంది జలమండలి. మోటార్ల ద్వారా నల్లా నీటిని తోడేస్తున్న తోడేళ్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మోటార్ ఫ్రీ టాప్ వాటరే లక్ష్యంగా రంగంలోకి దిగబోతున్నాయి ప్రత్యేక బృందాలు. నల్లాకు మోటార్లు బిగించి నీటిని తోడుతున్నట్టు తేలితే.. మొత్తంగా కనెక్షన్ కట్‌చేసి.. ఐదువేల రూపాయలు జరిమానా విధించనున్నారు.
నీటి సరఫరాలో లో-పెషర్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ స్పెషల్ డ్రైవ్ చేపడుతోంది. లైన్‌మెన్ దగ్గర్నుంచి ఎండీ వరకు ఏప్రిల్ 15నుంచి ఫీల్డ్‌లోకి వెళ్లాలని నిర్ణయించారు. వేసవిలో నీటి కొరత రాకుండా జలమండలి అధికారులు చర్యలు చేపడుతున్నారు. అలాగే, నీటి వృథా చేసేవారిపైనా దృష్టిపెట్టబోతోంది. శుద్ధిచేసి సరఫరా చేస్తున్న నీటిని వృథా చేస్తూ.. ఇతర అవసరాలకు ఉపయోగించేవారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది జలమండలి. నల్లాల నుంచి మోటార్ల ద్వారా నీటిని తోడితే కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు.
ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోగా కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. రానున్నరోజులలో నీటికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు తాగునీటికై సరఫరా చేసే శుద్ధమైన నీటిని వృధా చేయకూడదని జలమండలి విజ్ఞప్తి చేస్తోంది. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి జలమండలి సుదూర ప్రాంతాల నుంచి నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తోంది. కాబట్టి.. నీటిని వృథా చేయకుండా వాటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కోరుతున్నారు.
అదే విధంగా అన్నీ సర్కిల్ సీజీఎం, డివిజన్ జీఎం, డీజీఎం, సెక్షన్ మేనేజర్లతో కూడా జూమ్ మీటింగ్ నిర్వహించి నీరు సరఫరాలో సాధారణ ప్రెషర్ ఉండే కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని జలమండలి ఎండీ ఆదేశించారు. ఇందుకు ప్రత్యేకంగా ‘మోటర్ ఫ్రీ టాప్ వాటర్’ పేరుతో కార్యాచరణ ప్రకటించారు.
వేసవిలో ‘మోటర్ ఫ్రీ టాప్ వాటర్’ లక్ష్యంగా నాలుగు దశల తనిఖీలకు జలమండలి సిద్దమైంది. నల్లా నీటి సరఫరాలో లో పెష్రర్‌కు చెక్ పెట్టి సాధారణ స్థాయి వత్తిడితో నీటి సరఫరా జరిగే విధంగా ‘మోటర్ ఫ్రీ టాప్ వాటర్’ పేరుతో ఏప్రిల్ 15(మంగళవారం) నుంచి వాటర్ స్పెషల్ డ్రైవ్ అమలు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. క్షేత్ర స్థాయిలో నల్లానీటి సరఫరా సమయంలో లైన్‌మెన్ నుంచి ఎండీవరకు పర్యటించి తనిఖీలు నిర్వహించనున్నారు. వేసవి ముగిసే వరకు అకస్మిక తనిఖీలు కొనసాగనున్నాయి.
మొదటిదశలో లైన్‌మెన్లు వాటర్‌వాల్వ్ తిప్పగానే సరఫరా చేసే లైన్లలో కనెక్షన్ టూ కనెక్షన్ పరిశీలించి వాటర్ ప్రెషర్, మోటర్ల వినియోగాన్ని గుర్తిస్తారు.
రెండో దశలో మరుసటిరోజు (రోజు విడిచి రోజు) సెక్షన్ మేనేజర్ అదే లైన్‌లో నల్లా నీటిసరఫరా.. మోటర్ల వినియోగాన్ని గుర్తించి నల్లాకు మోటర్ బిగిస్తే రూ.5 వేలు జరిమానా విధించి తక్షణమే మోటర్ సీజ్ చేస్తారు.క్యాన్ నెంబర్‌ను బ్లాక్ లిస్ట్‌లు పెడుతారు. ఆ తర్వాత లైన్ల వారిగా (క్యాన్‌నెంబర్ల జాబితా)తో ‘మోటర్ ఫ్రీ టాప్‌వాటర్’ లైన్లుగా జీఎంలకు ఆన్‌లైన్ నివేదిక సమరిస్తారు.
మూడో దశలో మేనేజర్ల నివేదిక ఆధారంగా జీఎంలు క్షేత్ర స్థాయిలో లైన్లను ర్యాండమ్‌గా పరిశీలించి సంతృప్తి వ్యక్తమైతే సీజీఎంలకు నివేదిక సమర్పిస్తారు. అక్కడ నుంచి డెరెక్టర్, డైరెక్టర్‌నుంచి మేనేజింగ్ డైరెక్టర్ లాగిన్ కు రోజువారిగా ఆన్‌లైన్ నివేదిక సమర్పిస్తారు.
నాలుగో దశలో ఆ నివేదికలను బట్టి క్రాస్ చెక్ కోసం సీజీఎం, డైరెక్టర్, ఎండీలు క్షేత్ర స్థాయిలో ర్యాండమ్‌గా తనిఖీలు నిర్వహిస్తారు. జరిమానాలు విధించడం, మోటర్లు సీజ్ చేయడం కొనసాగిస్తారు.
మోటర్ ఫ్రీ టాప్ వాటర్ సర్వేలో ఏ స్ధాయిలో కూడా సమగ్ర పరిశీలన జరపకుండా తప్పుడు నివేదిక సమర్పిస్తే మాత్రం ఆ స్థాయి అధికారి పనితీరు అంచనా వేసి ర్యాంకింగ్ విధించడంతోపాటు మోమోను జారీ చేయాలని జలమండలి నిర్ణయించింది. అదేవిధంగా ప్రధానకార్యాలయంలో ఏర్పాటు చేసే డ్యాష్ బోర్డులో ఆన్‌లైన్ ఆధారంగా ప్రతిరోజు నివేదికలను పర్యవేక్షిస్తారు. ఇప్పటికే వాటర్ వాల్స్‌ను జీయోట్యాంగింగ్ చేసి ఆన్‌లైన్ లాగిన్‌కు అననుసంధానం చేశారు. సెక్షన్‌నంచి ఎండీ వరకు పర్యవేక్షించేందుకు వెసులు బాటు కల్పించారు.
నీటి నల్లాలకు మోటార్లను బిగించి అక్రమంగా నీటిని తోడుతున్న వారికి జరిమానా విధించడానికి, జలమండలి సరఫరా చేస్తున్న నీటిని తాగు నీటికి కాకుండా ఇతర అవసరాలకు వినియోగించే వారి పై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రత్యేకమైన మొబైల్ యాప్ ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా నీటి నల్లాలకు మోటార్లను బిగించినా, తాగడానికి కాకుండా ఫ్లోర్లు కడగడం, వాహనాలు శుభ్రం చేయడం, గార్డెనింగ్, ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ఓవర్ ఫ్లో, నిర్మాణ పనుల కోసం నీటిని వృధా చేస్తే జరిమానా విధించడానికి ఈ యాప్ ని రూపొందించారు.
రెండు రోజుల్లో ఈ యాప్ ని జీఎం నుంచి క్షేత్ర స్తాయిలోని లైన్ మెన్ల వరకు అందరికి అందుబాటులోకి తెస్తారు. వీరు ఆ ప్రాంతాల్లో ఇల్లీగల్ మోటార్లను బిగించి అక్రమంగా నీటిని తోడుతున్న వారిని, నీటి వృధా చేస్తున్న వినియోగదారులను గుర్తించి ఫోటోతో సహా యాప్ లో అప్లోడ్ చేయడం.. సదరు కనెక్షన్ గుర్తించి ట్యాగ్ చేయడంతో వెంటనే ఆ కన్స్యూమర్ కనెక్షన్ నెంబర్ పై జరిమానా మంజూరు చేయడంతో సదరు వినియోగదారుడి కనెక్షన్ అకౌంట్ కు పెనాల్టీ జమ అవుతుంది. అలాగే ఈ మొత్తం మే నెల బిల్ లో చెల్లించేలాగా రూపొందించారు. అనంతరము రెండో దశలో నీటి సంరక్షణ కోసం చేసేందుకు ఏ పౌరులకు సైతం వాలెంటర్ గా యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తారు.