మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్

గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్‌లో 2 రోజులు మద్యం షాపులు, బార్లు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. భక్తుల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్టార్ హోటల్స్, లైసెన్స్డ్ క్లబ్‌లకు మాత్రం మినహాయింపు ఉంది. నగరంతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహా ఆంక్షలు అమలవుతున్నాయి.

గణేశ్ నిమజ్జనాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులు పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో రెండు రోజుల పాటు మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి.. 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అన్ని వైన్ షాపులు, బార్లు, మద్యం అందించే రెస్టారెంట్లు తాత్కాలికంగా మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే స్టార్ హోటల్స్‌, లైసెన్స్ కలిగిన క్లబ్‌లకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిమజ్జన ఉత్సవం సమయంలో శాంతి భద్రతలు కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా ఈ తరహా ఆంక్షలు అమలులోకి వస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా విషయానానికి వస్తే.. సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 6 గంటల నుండి 6వ తేదీ సాయంత్రం వరకు వైన్ షాపులను మూసివేయాలని ఆదేశాలు ఉన్నాయి. పెద్దపల్లి, ఇతర జిల్లాల్లోనూ నిమజ్జనం రోజున మద్యం విక్రయాలపై నిషేధం విధిస్తూ కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. గణేష్ నిమజ్జన సమయంలో వాహనదారులు మద్యం సేవించి ప్రమాదాలకు గురయ్యే అవకాశం తగ్గించే ప్రయత్నంగా దీన్ని చెప్పవచ్చు.

కాగా హైదరాబాద్ నగరంలో బడా గణేశ్ నిమజ్జనం సెప్టెంబర్ 6వ తేదీన ఖైరతాబాద్ వద్ద వైభవంగా జరగనుంది. ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఈ రెండు రోజులు భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశముండటంతో, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేయనున్నారు. పోలీస్ శాఖతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలు కూడా అవసరమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశాయి.

Please follow and like us:
తెలంగాణ వార్తలు