ఇక మలేరియా మటాష్.. హైదరాబాద్‌లో తొలి స్వదేశీ వ్యాక్సిన్ తయారీ..

ఇక మలేరియా మటాష్.. హైదరాబాద్‌లో తొలి స్వదేశీ వ్యాక్సిన్ తయారీ..

యాడ్‌ఫాల్సీ వ్యాక్స్ అని పిలువబడే ఈ వ్యాక్సిన్ భారత దేశపు మొట్టమొదటి స్వదేశీ, రీకాంబినెంట్ మలేరియా వ్యాక్సిన్. సాంప్రదాయ వ్యాక్సిన్‌ల మాదిరిగా కాకుండా మలేరియా పరాన్నజీవి ప్లాస్మోడియం ఫాల్సిపరంను గట్టిగా అడ్డుకుంటుంది. ఇది సంక్రమణ వ్యాప్తిని ఆపడంలో మరింత ప్రభావవంతంగా ఉంటుంది.

మలేరియాపై పోరాటంలో కీలక అడుగు పడింది. దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ మలేరియా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు దశాబ్ద కాలంగా జరుగుతున్న ప్రయత్నం ఫలించనుంది. ఈ చారిత్రక కృషిలో ప్రధాన పాత్ర పోషిస్తోంది మన హైదరాబాద్ నగరం. హైదరాబాద్‌కు చెందిన రెండు ప్రముఖ వ్యాక్సిన్ కంపెనీలైన ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (IIL), బయోలాజికల్ E లిమిటెడ్.. ఈ వ్యాక్సిన్‌ను తయారు చేయడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నుండి లైసెన్స్ పొందాయి. ‘ఆడ్‌ఫాల్సీ వ్యాక్స్ అనే పేరుతో ఈ వ్యాక్సిన్ రూపొందించబడింది. ఇది సాధారణ వ్యాక్సిన్‌ల మాదిరిగా కాకుండా మలేరియా పరాన్నజీవిని బహుళ దశలలో అడ్డుకుంటుంది. పరాన్నజీవి కాలేయంలోకి ఆ తర్వాత రక్తప్రవాహంలోకి ప్రవేశించే ముందు దాడి చేసి, వ్యాధి వ్యాప్తిని నిరోధించడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

క్లినికల్ ట్రయల్స్ సక్సెస్:
ఈ వ్యాక్సిన్ ఇప్పటికే కీలకమైన ప్రీ-క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసుకుంది. జంతు నమూనాలు, ప్రయోగశాల అధ్యయనాలలో అద్భుతమైన సామర్థ్యాన్ని, భద్రతను ఇది నిరూపించుకుందని అధికారులు వెల్లడించారు. ICMR లైసెన్స్ ఇవ్వడంతో ఇప్పుడు కంపెనీలు ఈ టీకాను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడం, క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేయడం, ఆపై సరఫరా చేయడం వంటి పనులు చేపడతాయి.

వ్యాక్సిన్ ప్రత్యేకతలు:
ఈ వ్యాక్సిన్ మలేరియా పరాన్నజీవి యొక్క బలహీనమైన లేదా చనిపోయిన వెర్షన్‌ను ఉపయోగించదు. బదులుగా ఇది ఒక ప్రత్యేకమైన రికాంబినెంట్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. జున్ను తయారీలో ఉపయోగించే బ్యాక్టీరియాలోకి మలేరియా పరాన్నజీవి నుండి ఒక చిన్న, హానిచేయని ప్రోటీన్‌ను చొప్పించి, ఆ ప్రోటీన్‌ను టీకాలో ఉపయోగిస్తారు. ఈ వ్యాక్సిన్ చాలా తక్కువ ధరలో అందుబాటులోకి వస్తుందని అంతా భావిస్తున్నారు. గది ఉష్ణోగ్రత వద్ద కూడా ఇది తొమ్మిది నెలలకు పైగా ప్రభావవంతంగా ఉంటుంది. ఇప్పటివరకు చేసిన పరీక్షలు ఒకే షాట్ దీర్ఘకాల రక్షణను అందిస్తుందని సూచిస్తున్నాయి. భారత్ మలేరియా రహిత దేశంగా మారడానికి ఈ స్వదేశీ వ్యాక్సిన్ ఒక బలమైన అస్త్రంగా నిలుస్తుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Please follow and like us:
Lifestyle తెలంగాణ లైఫ్ స్టైల్ వార్తలు