జనాల కంటపడిన వింత పక్షి.. చూడ్డానికి అందంగా కనిపించే ఈ జీవి గురించి తెలిస్తే..

జనాల కంటపడిన వింత పక్షి.. చూడ్డానికి అందంగా కనిపించే ఈ జీవి గురించి తెలిస్తే..

అల్లూరి ఏజెన్సీలో అరుదైన అతిధి గిరిజనుల కంటపడింది. పెరిగిన ఉష్ణోగ్రతలకు వడదెబ్బ తగిలిందో ఏమో కానీ.. స్పృహకోల్పోయి స్థితిలో పొలంలో కనిపించింది. చలించిన ఆ గిరిజన యువకులు.. ఆ పక్షిని పట్టుకొని సపర్యలు చేసి.. ప్రాణాలను కాపాడారు. అనంతరం అటవీశాఖ అధికారులకు అప్పగించారు. చూడ్డానికి గద్దలా ఉన్నా.. వాటికి మించిన అందంతో తలపై పొడుచుకు వచ్చిన ముదురు తెలుగు రంగు ఈకలు, పసుపు రంగు ముఖం, విశాలమైన రెక్కలు, పదునైన ముక్కు, ఖాళీ గోళ్ళు, కాంతివంతమైన కళ్ళతో అందరినీ ఆకట్టుకుంది ఈ పక్షి.

అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీ జెర్రెల పంచాయితీ నిట్టమామిడి పాలెంలో ఈ పక్షి కనిపించింది. ఓ రైతు పొలం పనులకు వెళ్తుండగా అక్కడ పడి ఉన్న పక్షిని చూసి చలించిపోయాడు. ధైర్యం చాలక పక్కనే ఉన్న యువకులకు సమాచారం అందించాడు. అక్కడకు వచ్చిన యువకులు ఆ పక్షిని చూసి గద్దగా గుర్తించారు. అయితే.. సాధారణంగా కనిపించే గద్దలకు కాస్త భిన్నంగా ఉండడంతో పట్టుకునేందుకు తోలుత వారికి ధైర్యం చాలలేదు. అలాగే వదిలేస్తే ప్రాణం పోతుందనే చలించి దాన్ని పట్టుకొని గ్రామంలోకి తీసుకొచ్చారు.

సపర్యలు చేసి.. కోలుకునేలా సాధారణ స్థితికి తీసుకొచ్చారు. ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో అందరూ ఆ గెద్దను చూసేందుకు క్యూ కట్టారు. గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడి చేరుకున్న అధికారులు ఆ పక్షి పరిశీలించి.. అది క్రెస్టెడ్ సర్పెంట్ ఈగల్ గా గుర్తించారు. సుదూర ప్రాంతం నుంచి ప్రయాణం చేస్తూ వచ్చి ఇలా ఎండ దెబ్బకు సొమ్మసిల్లి పడి ఉంటుందని అధికారులు అంటున్నారు.

క్రెస్టెడ్ సర్ఫెంట్ ఈగల్..

ఇది స్పీలోర్నిస్ చీలా జాతుల్లో ఒకటైన గద్ద. ఇది ఎక్కువగా ఉష్ణ మండల ఆసియా ప్రాంతాల్లో కనిపించే వేటాడే పక్షి. విలక్షణమైన స్వరూపంతో ముదురు తెల్లటి కొనలు కలిగిన ఈకలతో తలపై దట్టమైన శిరస్ట్రాణం మాదిరిగా ఉంటుంది. ఇదే ఈ పక్షికి ప్రత్యేక ఆకర్షణ. ప్రకాశవంతమైన పసుపు కళ్ళు, చర్మం ఉంటాయి. పాములు ఇతర సరీసృపాలను వేటాడటంలో తనకు తానే సాటి. ఇవి అటవీ ప్రాంతాలు, తడి, గడ్డి మైదానాల సమీపంలో నివసిస్తాయి. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లోనే తనకు ఆహారానికి నివాసానికి అనుకూల వాతావరణ ఉంటుంది. విశాలమైన రెక్కలు.. ఆకాశంలో చాలా ఎత్తులో ఎగిరేందుకు సహకరిస్తాయి.

ఆకాశంలో ఎగురుతూ.. ఎక్కడో దూరంగా భూమిపై సంచరించే పాములు, సరిసృపాలను తన కాంతివంతమైన కళ్ళతో గుర్తించి.. క్షణాల్లో కిందకు వచ్చి వాటిని ఎత్తుకెళ్లడం వీటి ప్రత్యేకత లక్షణం. ఇవి పాములను వేటాడేటప్పుడు తన పాదాలకు ఉండే ఒక రకమైన చర్మం పాము విషపూరిత కాటు నుంచి కూడా రక్షణ కల్పించేలా నిర్మాణం ఉంటుంది. భారతదేశంతో పాటు శ్రీలంక, ఆగ్నేయసియా, తూర్పు ఆసియా అడవులు, చెరువులు ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఇటువంటి పక్షులు ఎక్కడ కనిపించినా దానికి హాని తలపెట్టకుండా తమకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు అటవీశాఖ అధికారులు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు