అల్పపీడనం ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలతో పాటు దేశంలో అనేక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ సహా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు కర్ణాటకలో తుఫాను తీరం దాటే..
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలతో పాటు దేశంలో అనేక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ సహా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు కర్ణాటకలో తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మే 23 వరకు కొనసాగనున్న అల్పపీడన ప్రభావం ఉండనుంది. ఏపీలో కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీపొట్టిశ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీంతో రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 – 5 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. సోమవారం (మే 19) వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవగా.. మంగళవారం (మే 20) కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇక బుధవారం (మే 21), గురు, శుక్ర వారాల్లో కూడా పలు జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మొత్తంగా నేటి నుంచి వరుసగా నాలుగు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉంది. రైతులు ఈ అకాల వర్షాలకు తమ పంటలను జాగ్రత్త చేసుకోవాలని అధికారులు సూచించారు.