నగరంలో భారీ వర్షం – అత్యవసరం అయితే తప్ప బయటకి రావొద్దు

నగరంలో భారీ వర్షం – అత్యవసరం అయితే తప్ప బయటకి రావొద్దు

హైదరాబాద్‌ను వాన ముంచెత్తింది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లు నదుల్లా మారిపోయాయి. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. GHMC రెస్క్యూ టీమ్‌లు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.

హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన వర్షం నాన్‌స్టాప్‌గా పడుతూనే ఉంది. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లు నదుల్లా మారిపోయాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, అమీర్‌పేట్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, మియాపూర్, మలక్‌పేట్, చంచల్‌గూడ, ముషీరాబాద్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. చాలాచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లి రోడ్లపైకి వచ్చాయి. కొన్నిచోట్ల వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.

వర్షంతో నెలకొన్న పరిస్థితులపై GHMC మానిటరింగ్ టీమ్‌లు అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించి, పలు ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించినట్లు అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరిందని స్థానికులు వాపోతున్నారు. వర్షానికి ప్రధాన రహదారులన్నీ జామ్ అయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ పనిచేయకపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. ముఖ్యంగా పీక్ అవర్స్‌లో వర్షం మోత అదనపు భారంగా మారింది.

వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, రాబోయే 24 గంటల్లో కూడా హైదరాబాద్‌లో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

భారీ వర్షం నేపథ్యంలో పౌరులు అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసితులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో 100 లేదా 040–29555500 నంబర్లకు సంప్రదించాలని GHMC విజ్ఞప్తి చేసింది.

Please follow and like us:
తెలంగాణ వార్తలు