మరో పిడుగు లాంటి వార్త చెప్పిన వాతావరణ శాఖ.. ఈ వారాంతంలో మరో అల్పపీడనం

మరో పిడుగు లాంటి వార్త చెప్పిన వాతావరణ శాఖ.. ఈ వారాంతంలో మరో అల్పపీడనం

రాబోయే నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశంతో పలు జిల్లాల్లో భారీవానలు కురవొచ్చని తెలిపింది. కోనసీమలో ఇప్పటికే వర్షాల కారణంగా లంక గ్రామాల ప్రజలు వరద ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాల వద్ద వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీవానలు కురుస్తాయని సూచించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది. గంటకు 30–40 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఈ వారాంతంలో బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ఏపీతో పాటు తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర రాష్ట్రాలపై ప్రభావం చూపే అవకాశముంది. ఇప్పటికే భారత వాతావరణ విభాగం (IMD) ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది పశ్చిమ–వాయవ్య దిశగా కదిలి ఏపీ, ఒడిశా, తెలంగాణ వైపు చేరుతుందని, దీని ప్రభావంతో ఈ నెలాఖరు వరకు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవొచ్చని సూచించింది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు