దేశంలో బంగారం ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాదిలో బంగారం ధరలు రూ.34 వేలకు పైగా పెరిగాయి. ఈ దీపావళి నాటికి బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు పెరగడానికి కారణాలు ఏంటీ..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
బంగారం భారతీయ సంప్రదాయంలో ఒక భాగం. మహిళలకు ఇదొక సెంటిమెంట్. పండుగైనా, శుభకార్యమైనా మహిళలకు బంగారం కొనాల్సిందే. అయితే గత కొన్ని రోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతూ ప్రజలను భయపెట్టిస్తోంది. ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఈ ఏడాది గడిచిన 253 రోజుల్లో బంగారం ధరలో రూ.34,050 పెరుగుదల కనిపించింది. డిసెంబర్ 31, 2024న 10 గ్రాముల బంగారం ధర రూ.78,950గా ఉండగా, సెప్టెంబర్ 10, 2025 నాటికి అది రూ.1,12,750కి పెరిగింది. ఈ పెరుగుదల బంగారం పెట్టుబడిదారులకు 43.12% రాబడిని ఇచ్చింది.
బంగారం ధరల పెరుగుదలకు కారణాలు:
కొనుగోళ్లు: ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుండడం దాన్ని ధరలు పెరగడానికి ఓ కారణం.
బలహీనపడిన డాలర్: అమెరికన్ డాలర్ ఇండెక్స్ ఏడు వారాల కనిష్ట స్థాయికి పడిపోవడం.
రాజకీయ అనిశ్చితులు: మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఫ్రాన్స్, జపాన్‌లలో రాజకీయ సంక్షోభం, రష్యాపై అమెరికా ఆంక్షలు.
వడ్డీ రేట్లలో కోతలు: యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండడం.
ధరలు పెరిగే ఛాన్స్
బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతుండగా, వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీపావళి నాటికి ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.1.25 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈఓ చింతన్ మెహతా మాట్లాడుతూ.. అమెరికా ట్రెజరీ దిగుబడి తగ్గుదల, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారానికి బలాన్ని ఇస్తున్నాయని తెలిపారు. అలాగే ప్రజల పోర్ట్‌ఫోలియోలో బంగారం ఒక ముఖ్యమైన భాగంగా మారుతోందని వెంచురాలోని కమోడిటీ డెస్క్ అధిపతి ఎన్.ఎస్. రామస్వామి అన్నారు. ఫెడ్ యొక్క రాబోయే వడ్డీ రేటు నిర్ణయాలు, యూఎస్ స్థూల ఆర్థిక గణాంకాలు బంగారం ధరలపై ప్రభావం చూపవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.