హైదరాబాద్ జంట నగరాల పరిధిలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలుచోట్ల రోడ్లపై వరద నీరంతా నిలిచిపోయింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది.. ఇవాళ హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సాయంత్రం వేళ కుండపోత వర్షం కురుస్తుందని అలర్ట్ జారీ చేసింది..
హైదరాబాద్ జంట నగరాల పరిధిలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలుచోట్ల రోడ్లపై వరద నీరంతా నిలిచిపోయింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది.. ఇవాళ హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సాయంత్రం వేళ కుండపోత వర్షం కురుస్తుందని అలర్ట్ జారీ చేసింది.. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రాత్రి 11గంటల వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా సాయంత్రం ఈదురుగాలులతోపాటు.. కుండపోత వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికలతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక సూచన చేసింది.. ఉద్యోగులకు ఎర్లీ లాగ్ అవుట్ తోపాటు.. సాయంత్రం షిఫ్ట్ ఉన్న వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వాలంటూ ఆయా కంపెనీలకు సూచించింది.. ఈ మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం అడ్వైజరీ జారీ చేసింది. సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనలతో.. ఆయా కంపెనీలు ఉద్యోగులకు 3 గంటల నుంచి ఇళ్లకు వెళ్లేందుకు వీలుగా.. తొందరగా లాగ్ అవుట్ అవకాశం ఇవ్వాలని.. అలాగే.. సాయంత్రం షిఫ్ట్ ఉన్న వారికి ఇంటి నుంచి పనిచేసే అవకాశం ఇవ్వాలని కోరింది. అలా చేయడం వల్ల భద్రత తోపాటు.. ట్రాఫిక్ కష్టాలు ఉండవని.. ఎమర్జెన్సీ సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగదని పేర్కొంది.
ఇదిలాఉంటే.. వచ్చే రెండు రోజులు కూడా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయని జీహెచ్ఎంసీ పేర్కొంది.. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అలర్ట్ జారీ చేసింది.
కాగా.. మంగళవారం ఉదయం నుంచి మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, లింగంపల్లి, చందానగర్, మియాపూర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, యూసఫ్‌గూడ, బోరబండ, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, కేపీహెచ్‌బీ కాలనీ, ఆల్విన్‌కాలనీ, కుత్బుల్లాపూర్, దుండిగల్, గండిమైసమ్మ, మల్లంపేట, కొంపల్లి, సుచిత్ర, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, బాలానగర్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. భారీ వర్షాలతో హైదరాబాద్ మూసారాంబాగ్ దగ్గర మూసి ఉధృతి ప్రమాదకరంగా మారింది. నగరంలో భారీ వర్షాలతో వరద అంబర్‌పేట్ దగ్గర బ్రిడ్జిని ఆనుకొని ప్రవహిస్తోంది. దీంతో బ్రిడ్జి దగ్గర పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. బ్రిడ్జిపైకి నీరు చేరితే రాకపోకలు నిలిపివేసే అవకాశం ఉంది. దిల్‌సుఖ్‌నగర్ – అంబర్ పేట్ మధ్య రాకపోకలు నిలిచిపోనున్నాయి. దీంతో ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు..