నందమూరి బాలకృష్ణపై సోషల్ మీడియాలో వచ్చిన ఎమోజీ రిప్లైకి సంబంధించిన వివాదంపై హోం స్పెషల్ సెక్రటరీ సీవీ అనంద్ స్పష్టత ఇచ్చారు. ఆ పోస్టును తాను చేయలేదని, సోషల్ మీడియాను చూసే హ్యాండ్లర్ రెండు నెలల క్రితం తనకు తెలియకుండా పెట్టాడని చెప్పారు.
సెప్టెంబర్ నెలలో సీవీ ఆనంద్ హైదరాబాద్ ఉన్న సమయంలో సిటీ పోలీసులు అతిపెద్ద సినిమా పైరసీ రాకెట్ గుట్టు రట్టు చేశారు. ఆ సమయంలో తెలుగు చిత్రరంగ ప్రముఖులతో ఓ మీటింగ్ నిర్వాహించారు. ఈ సమావేశానికి బాలయ్య తప్ప అగ్ర హీరోలు అందరూ హాజరయ్యారు. పైరసీకి ఎలా చెక్ పెట్టాలి, టాలీవుడ్-పోలీసుల మధ్య సమన్వయంతో పని చేయడంపై లోతైన చర్చ జరిగింది. ఈ మీటింగ్‌కు సంబంధించిన వివరాలను సీవీ ఆనంద్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఓ నెటిజన్.. బాలయ్యను కూడా మీటింగ్‌కు పిలవండి.. లేదంటే ఆయన అసెంబ్లీలో ప్రశ్నిస్తాడు అని కామెంట్ పెట్టాడు. కామెంట్‌కి సీవీ ఆనంద్ ఖాతా నుంచి స్మైలీ ఎమోజీ పెట్టారు. ఆ ఎమోజీపై బాలయ్య అభిమానులు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. టాలీవుడ్ పిల్లర్, మూడుసార్లు ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ అయిన బాలకృష్ణ గురించి ఇలా స్పందించడంపై ఫ్యాన్స్ ఫైరయ్యారు. ఈ వివాదం రెండు నెలలుగా సోషల్ మీడియాలో నలుగుతూనే ఉండగా.. తాజాగా సీవీ ఆనంద్ స్పష్టత ఇచ్చారు.
అది తన సోషల్ మీడియా ఖాతాలు చూసే వ్యక్తి తెలియక పెట్టాడని.. అది తన నాలెడ్జ్‌లో లేకుండా చేసిన పని అని, ఈ విషయాన్ని తాను వెంటనే తెలుసుకోలేకపోయానని చెప్పారు. విషయం తెలిసిన వెంటనే.. ఆ పోస్ట్ డిలీట్ చేసి.. పూర్తి వివరాలు వాకబు చేసినట్లు పేర్కొన్నారు. బాలకృష్ణతో తనకు ఎన్నో ఏళ్ల సాన్నిహిత్యం ఉన్నందున పర్సనల్ మెసెజ్ ద్వారా సారీ చెప్పినట్లు వెల్లడించారు. తనకు అగ్ర నటులు అందరిపై గౌరవం ఉందని చెప్పారు. ఆ రిప్లై ఇచ్చిన సోషల్ మీడియా హ్యాండ్లర్లను తొలగించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదం ఇక్కడితో ముగించాలని అందరికీ విజ్ఞప్తి చేశారు.

