ఉగ్రవాదం అంతానికి సీపీఎం సహకరిస్తుందన్నారు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ. ఉద్రిక్తతల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. పహల్గాం హంతకులను అప్పజెప్పడానికి పాకిస్తాన్ పై వివిధ వేదికల ద్వారా ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
ఉగ్రవాదం అంతానికి సీపీఎం సహకరిస్తుందన్నారు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ. ఉద్రిక్తతల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. పహల్గాం హంతకులను అప్పజెప్పడానికి పాకిస్తాన్ పై వివిధ వేదికల ద్వారా ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తగ్గించి సాధారణ పరిస్థితి పునరుద్ధరణకు, శాంతి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. తిరుపతిలో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర కమిటీలో పాల్గొన్న బేబీ మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తీవ్రవాదుల అణచివేతకు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయ్యిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారన్నారు. దేశ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తగ్గించే దిశగా కేంద్రం చర్యలు చేపట్టాలని కోరారు ఎంఎ బేబీ. దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే అందుకు దీటుగా బదులిచ్చేలా సరైన కార్యాచరణతో కేంద్ర ప్రభుత్వం సమయాను కూలంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. అమాయకుల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
కులగణన బీహార్ ఎన్నికల కోసమే..
కులగణనపై కేంద్రం నిర్ణయం కేవలం బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే చేసిందన్నారు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి బేబి. కేంద్రం ప్రకటనపై ప్రజల్లో అదే భావన ఉందన్నారు. కేంద్రం కులగణన చేపట్టేందుకు అవసరమైన మార్గదర్శకాలు ఇప్పటి వరకు ప్రకటించకపోవడం దీన్నే బలపరుస్తోందన్నారు. కేవలం కులగణన తో సమస్య పరిష్కారం కాదని, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి తదితర స్థితిగతుల అధ్యయనంతో సమగ్ర సర్వే అవసరమన్నారు. అప్పుడే ప్రజల వాస్తవ పరిస్థితి క్షేత్ర స్థాయిలో తెలుసుకోవడానికి వీలవుతుందన్నారు. కులగణన సమగ్ర సామాజిక సర్వే గా చేపట్టాలన్నారు. అందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలని డిమాండ్ చేశారు. రానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సిపిఎం దీనిపై చర్చ లేవనెత్తనుందన్నారు బేబీ. రానున్న అక్టోబర్ లో నిర్వహించనున్న బీహార్ ఎన్నికల పోరులో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఎ మతతత్వ రాజకీయ పార్టీలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నామన్నారు. ఒక విశాల ప్రాతిపదికన ప్రజాస్వామ్య అభ్యుదయ రాజకీయ శక్తులతో కలసి వామపక్ష పార్టీలు మహాకూటమిగా పని చేయనున్నాయని బేబీ చెప్పారు.
ఇప్పటికే బీహార్ ఆర్ జె డి నేత తేజస్వీ యాదవ్ తో సమావేశమై చర్చించినట్లు చెప్పారు. బిహార్ లోని సిపిఐ ఇతర వామపక్ష నాయకులతో కూడా చర్చినట్లు బేబీ పేర్కొన్నారు. మతతత్వ శక్తుల ఆకర్షణీయ విధానాలకు మోసపోకుండా ఐక్యత, అభివృద్ధి, మత సామరస్యం కోసం కృషి చేసే పార్టీలకు మద్దతివ్వాలిని పిలుపునిచ్చారు. కేరళ తమిళనాడు పాండిచ్చేరి పశ్చిమ బెంగాల్ అస్సాం రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర కమిటీ సమావేశంలో చర్చించి ఎన్నికల ఎత్తుగడలను రూపొందిస్తామని బేబీ వివరించారు.