కొందరికి జలుబు, దగ్గుతోపాటు గొంతు నొప్పి సమస్యలు కూడా ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా రాత్రిపూట వచ్చే తీవ్రమైన దగ్గు నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. ఈ సమస్యకు మీ వంటగదిలో ఉండే ఒక చిన్న పదార్ధంతో చిటికెలో చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు..
వాతావరణంలో మార్పుల కారణంగా తరచూ జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. జలుబు, దగ్గుతోపాటు గొంతు నొప్పి సమస్యలు కూడా ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా రాత్రిపూట వచ్చే తీవ్రమైన దగ్గు నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. ఈ సమస్యకు మీ వంటగదిలో ఉండే ఒక చిన్న పదార్ధంతో చిటికెలో చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వంటగదిలో ఉండే లవంగాలు దగ్గుకు తక్షణ, ప్రభావవంతమైన ఉపశమనాన్ని అందిస్తాయి. పైగా ఆయుర్వేదం, సాంప్రదాయ గృహ నివారణలలో లవంగాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
రాత్రిపూట అకస్మాత్తుగా దగ్గు మొదలైతే అది ఓ పట్టాన ఆగదు. ఇలాంటి సమయంలో ముందుగా ఓ గుక్క నీరు తాగాలి. ఆ తర్వాత నోట్లో ఓ లవంగం మొగ్గ ఉంచుకోవాలి. లవంగాన్ని మీ దంతాల మధ్య ఉంచి తేలికగా నొక్కండం వల్ల దానిలోని ఘాటు పదార్ధం నోట్లోకి వెళ్తుంది. తద్వారా దాని రసం నెమ్మదిగా గొంతులో ప్రవహిస్తుంది. ఇది మీ దగ్గును ఆపుతుంది. దీంతో హాయిగా నిద్రపోవచ్చు. ఇక ఉదయం నిద్రలేవగానే నోట్లో లవంగాలను ఉమ్మివేస్తే సరిపోతుంది. అయితే ఈ విధంగా చిన్న పిల్లలకు లవంగాలను తినిపించవద్దు. ఇది పిల్లల గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది.
లవంగాలలో యూజినాల్ అనే సహజ పదార్ధం ఉంటుంది. ఈ యాంటీ బాక్టీరియల్ పదార్థం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది గొంతులో వాపు, మంటను తగ్గిస్తుంది. లవంగాలను నమలడం వల్ల వాటి రసం నేరుగా మీ గొంతులోకి వెళ్లి దగ్గు నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. దగ్గుతో పాటు, లవంగాలు అనేక ఆరోగ్య సమస్యలకు ఉపయోగపడతాయి. లవంగాలు పంటి నొప్పి నుంచి కూడా ఉపశమనం పొందడంలో ఉపయోగపడతాయి. లవంగాలలోని ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. లవంగాలు ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
గమనిక: ఇందులో అందించిన సమాచారం, పరిష్కారాలు కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. మేము వాటిని నిర్ధారించడం లేదు. వాటిని అనుసరించే ముందు దయచేసి ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.

