సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. నోట్లోకి ముక్క పోవాల్సిందే. లేకపోతే పండగ జరుపుకున్నట్లు అనిపించదు. పండుగ దృష్ట్యా డిమాండ్ ఎక్కువగా ఉండటంతో చికెన్, మటన్ ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
తెలగు రాష్ట్రాల్లోని నాజ్ వెజ్ ప్రియులకు బిగ్ షాక్ తగిలింది. ఇక నాన్ వెజ్ వంటకాలు తినాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. చికెన్ లేదా మటన్ తినాలంటే జైబులకు చిల్లు పడాల్సిందే. పండుగ డిమాండ్ కారణంగా ఏపీ, తెలంగాణలో చికెన్,మటన్ ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఏకంగా రూ.100 ఒకసారి పెరిగాయి. దీంతో పండక్కి మాంసం తినాలనుకునే సామాన్య ప్రజలకు ధరల భారం తప్పడం లేదు. సంక్రాంతికి మాంసం ఎక్కువ తింటూ ఉంటారు. కనుమ రోజు చికెన్, మటన్ వంటివి ఎక్కువ తినే ఆనవాయితీ ఉంది. అలాగే గ్రామ దేవతలకు కోళ్లను మొక్కుల కింద చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించే సాంప్రదాయం ఉంది. ఇలాంటి తరుణంలో కోళ్ల ఉత్పత్తి తక్కువగా ఉండటం, డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా లేకపోవడంతో చికెన్, మటన్ ధరలు గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తోన్నాయి.
చికెన్, మటన్ కేజీ ఎంతంటే..?
గత నెలలో కేజీ చికెన్ ధర రూ.230 నుంచి రూ.240 మధ్య ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.100 పెరిగింది. ప్రస్తుతం కేజీ స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.330 నుంచి రూ.340 వరకు పలుకుతోంది. సాధారణ రోజులతో పోలిస్తే 100 రూపాయల మేర చికెన్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, వరంగల్ వంటి నగరాల్లో కేజీ చికెన్ స్కిన్ లెస్ ధర రూ.340 వద్ద కొనసాగుతోంది. ఇక ఇతర జిల్లాల్లో కూడా ఇలాగే ధరలు ఉన్నాయి. అటు చికెన్‌తో పాటు మటన్ ధరలు కూడా పెరుగుతున్నాయి. కేజీ మటన్ విత్ బోన్ రూ.1050, కేజీ మటన్ బోన్ లెస్ రూ.1250గా ఉంది. సాధారణ రోజుల్లో కేజీ మటన్ రూ.800 వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా రూ.వెయ్యికిపైగా చేరుకున్నాయి. పండగ రోజుల్లో మటన్ విక్రయాలు భారీగా ఉంటాయి. ఈ క్రమంలో డిమాండ్ కారణంగా ధరలు పెరిగాయి.
రాజీ పడని నాన్ వెజ్ ప్రియులు
ధరలు పెరుగుతున్నా నాన్ వెజ్ ప్రియులు ఎక్కడా రాజీ అనేది పడటం లేదు. ధరలు పెరిగిన నాన్ వెజ్ తినాల్సిందేనని అంటున్నారు. పండక్కి కడుపులోకి ముక్క దిగాల్సిందేనని అంటున్నారు. ధరలు పెరిగినా పండగ కావడంతో మాంసం విక్రయాలు మరింత పెరిగే అవకాశముంది. అటు ఇక నాటుకోళ్ల ధరలు ఆమాంతం పెరిగాయి. కేజీ నాటుకోడి రూ.2,500 వరకు పలుకుతోంది. ఇక హైదరాబాద్‌లో రూ.వెయ్యి వరకు ఉంది. గ్రామాల్లో నాటుగోళ్లను పెంచడం బాగా తగ్గిపోయింది. దీని వల్ల వీటి ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.

