సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) స్కూళ్లలో 20205-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల ఫైనల్ టైం టేబుల్‌ను తాజాగా బోర్డు విడుదల చేసింది..
దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) స్కూళ్లలో 20205-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల ఫైనల్ టైం టేబుల్‌ను తాజాగా బోర్డు విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు వచ్చే ఏడాది (2026) ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ప్రారంభవనున్నాయి. పదో తరగతి బోర్డు పరీక్షలు మార్చి 10 వరకు, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు సీబీఎస్ఈ పరీక్షల కంట్రోలర్ సన్యం భరద్వాజ్ ప్రకటించారు. ఆయా తేదీల్లో ఈ పరీక్షలు ఉదయం 10.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరగనున్నాయి.
సీబీఎస్‌ఈ తొమ్మిది, 11వ తరగతి విద్యార్థుల రిజిస్ట్రేషన్ డేటా ఆధారంగా గత నెలలో సీబీఎస్సీ బోర్డు ఈ పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక డేట్‌షీట్‌లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే పాఠశాలల్లోని విద్యార్థుల జాబితా (ఎల్‌ఓసీ)లను సమర్పించడంతో ఈ మేరకు బోర్డు తుది డేట్ షీట్‌ను తయారు చేసి విడుదల చేసింది. సకాలంలో జాబితాలు అందడంతో తొలిసారి ఈ పరీక్షలకు 110 రోజుల ముందుగా తుది డేట్ షీట్‌లను విడుదల చేసింది. తాజా టైం టేబుల్ ప్రకారం విద్యార్ధులకు ప్రిపరేషన్‌కు బోలెడంత సమయం లభించినట్లైంది. రెండు సబ్జెక్టుల మధ్య సన్నద్ధతకు విద్యార్థులకు తగినంత సమయం ఉండేలా దీనిని సిద్ధం చేశారు.
మరోవైపు 12వ తరగతి విద్యార్థులు ప్రవేశ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకొని ఈ డేట్ షీట్‌లను సిద్ధం చేసినట్లు బోర్డు వెల్లడించింది. అంతేకాకుండా ఈ సారి పలు ప్రవేశ పరీక్షల కంటే కాస్త ముందుగానే బోర్డు పరీక్షలను ముగియనున్నాయి. దీంతో బోర్డు పరీక్షలు, ప్రవేశ పరీక్షల మధ్య సమయాన్ని మెరుగ్గా వినియోగించుకోవడానికి అవకాశం లభిస్తుంది.

 
                                
