శుక్రవారం కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎలాగైతే విషాదంలోకి నెట్టిందో సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే నెలలో, ఇంచుమించు ఇదే ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదం కూడా ఇదే తరహాజో జనాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పుడు జరిగిన ప్రమాదంలో 20 మంది మృతి చెందగా 2013 అక్టోబర్ 30న జరిగిన ప్రమాదంలో 45 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. అయితే ఆనాడు పాలెం బస్సు ప్రమాద ఘటనపై దర్యాప్తు చేసిన ప్రత్యేక విచారణాధికారి, మాజీ డీజీపీ, ప్రస్తుత బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్ టీవీ9తో మాట్లాడారు.ఈ ప్రమాదాల గురించి ఆయన ఏం చెప్పారో తెలుసుకుందాం పదండి.
అది 2013 సంవత్సరం.. ఆ రోజు అక్టోబర్ 30.. దాదాపు 60 మంది ప్రయాణికులతో జబ్బర్ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ వోల్వో బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ బయల్దేరింది. తెల్లవారు జామున 5గంటలకు సరిగ్గా మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్దకు రాగానే కారును ఓవర్ టేక్ చేయబోయి కల్వర్టును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సుమారు 45 మంది ప్రయాణికులు సజీవ దహనం కాగా మరి కొంత మంది తీవ్ర గాయాలపాలై ప్రాణాలతో బయటపడ్డారు. అప్పుడు జరిగిన ఈ దారుణ ప్రమాదం భారతదేశంలో అత్యంత ఘాతకమైన బస్సు దుఘటనలలో ఒకటిగా చరిత్రలో నిలిచింది. కాగా సరిగ్గా ఆ ప్రమాదం జరిగిన 12 ఏళ్ల తర్వాత అదే ప్రాంతంలో మరోసారి బస్సు ప్రమాదం జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ప్రమాదానికి అసలు కారణాలు ఇవే
అయితే 2013లో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై విచారణ జరిపిన ప్రత్యేక విచారణాధికారి, మాజీ డీజీపీ, ప్రస్తుత బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్ ఇప్పుడు ఈ ప్రమాదం సందర్భంగా టీవీ9తో కొన్ని విషయాలను ప్రస్తావించారు. ఇలాంటి బస్సు ప్రమదాలకు సంబంధించిన కొన్ని కీలక విషయాలను ఆయన చెప్పుకొచ్చారు. రోడ్ డిజైన్ తో పాటు బస్ డిజైన్ లో లోపాల వల్లే పాలెం ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. పాలెం ఘటన జరిగిన ప్రాంతంలో రోడ్ విస్తరణ చేసి కల్వర్టును విస్తరించలేదు.. బస్ డ్రైవర్ స్పీడ్‌లో గమనించే లోపే బస్సు కల్వర్టును ఢీకొట్టింది. డ్రైవర్ సీట్ కిందే బ్యాటరీ కంపార్ట్మెంట్ ఉండడం వల్ల కల్వర్ట్‌ను ఢీ కొట్టిన వెంటనే బ్యాటరీ నుంచి స్పార్క్ వచ్చింది. పక్కనే ఉన్న పెట్రోల్ ట్యాంక్ అంటుకుంది. దీంతో బస్సులో మంటలు చెలరేగి ప్రమాదం జరిగినట్టు తెలిపారు.
ఈ కారణం వల్లే ఎక్కువ ప్రమాదాలు
కాబట్టి ప్రమాదం ఎలా జరిగింది అనేది బస్ డిజైన్ ను చూస్తే కానీ చెప్పలేం అని ఆయన అన్నారు. తాను అప్పట్లో డీజీపీగా అనేక సిఫార్సులు చేసానని.. ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి అన్ని అంశాలు తీసుకెళ్తానన్నారు. అయితే మానవ తప్పిదం వల్లే సుమారు 85 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్ తెలిపారు.

