ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ మొత్తం 691 పోస్టులకి జులై 14న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 100 సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖలో వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇప్పటికే అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ మొత్తం 691 పోస్టులకి జులై 14న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 100 సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు జులై 28 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 17, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పోస్టులకు సెప్టెంబరు 7, 2025న ఆఫ్‌లైన్ విధానంలో ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారు. అంటే పెన్, పేపర్ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారన్నమాట. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారిని మెయిన్స్ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తారు. మెయిన్స్ పరీక్ష తేదీ తేదీలను కూడా కమిషన్ త్వరలోనే వెల్లడించనుంది.
అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన అర్హతలు, సిలబస్, ఎంపిక విధానం, వయోపరిమితి, దరఖాస్తులు తదితర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చని కార్యదర్శి రాజబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి వివరణాత్మక నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా బోటనీ లేదా ఫారెస్టీ లేదా హార్టికల్చర్ లేదా జువాలజీ లేదా ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్ లేదా జియోలజీ లేదా అగ్రికల్చర్ స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. లేదంటే కెమికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా సివిల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా శారీరక కొలతలు ఉండాలి. ఎన్‌సీసీ సర్టిపికెట్ ఉన్నవారికి అదనపు మార్కులు కలుస్తాయి. వయోపరిమితి 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన పురుష, మహిళా అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.330 దరఖాస్తు ఫీజు కింద చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీకి సంబంధించిన వారు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.32,670 నుంచి రూ.1,01,970 వరకు జీతంగా చెల్లిస్తారు.