వరుస మరణాలతో వణుకు.. ఐదుకు చేరిన స్క్రబ్ టైఫస్ మృతులు

వరుస మరణాలతో వణుకు.. ఐదుకు చేరిన స్క్రబ్ టైఫస్ మృతులు

ఏపీని స్క్రబ్‌ టైఫస్‌ వణుకు పుట్టిస్తోంది. రోజురోజుకీ బాధితులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో స్క్రబ్‌ టైఫస్‌ కలకలం రేపగా.. ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఏకంగా ఇద్దరు మరణించడం మరింత వణికిస్తోంది. ఇప్పటికే.. చిత్తూరు, కాకినాడ, విశాఖ, విజయనగరం జిల్లాల్లో కేసులు బయటపడ్డాయి. విశాఖలో రెండు నెలల్లో 43 పాజిటివ్ కేసులు రికార్డ్‌ అయ్యాయి. దీనికి సంబంధించి విశాఖ కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్‌లో ప్రైమరీ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే.. పల్నాడు జిల్లాలో స్క్రబ్‌ టైఫస్‌ కలకలం రేపింది. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం రుద్రవరం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని జ్యోతి జ్వరం, ఒళ్లునొప్పులతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 20 రోజుల క్రితం మరణించింది. రాజుపాలెంకు చెందిన వృద్ధురాలు నాగమ్మ కూడా జ్వరంతో చికిత్స పొందుతూ 20 రోజుల క్రితం మృతి చెందింది. ఇప్పుడు.. రాజుపాలెం మండలం కొత్తూరుకు చెందిన సాలమ్మ అనే మరో వృద్ధురాలు కూడా స్క్రబ్ టైఫస్ లక్షణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడం టెన్షన్‌ పెడుతోంది. అయితే.. పల్నాడు జిల్లాలో కొద్దిరోజుల క్రితం ప్రాణాలు కోల్పోయిన జ్యోతి, నాగమ్మ శాంపిల్స్‌ను టెస్టుల కోసం ముంబై పంపగా.. స్క్రబ్ టైఫస్‌తో మృతి చెందినట్లు తేలడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక.. స్క్రబ్‌ టైఫస్‌ బారినపడి విజయనగరంలోనూ మూడు రోజుల క్రితం ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారు. నల్లిని పోలిన ఓ కీటకం కుట్టడంతో ఈ వ్యాధి సోకుతుందని వైద్యులు తెలిపారు. శరీరంపై ఒకచోట దద్దులు రావడంతోపాటు.. నల్లటి మచ్చ ఏర్పడితే స్క్రబ్ టైఫస్‌ లక్షణంగా గుర్తించాలన్నారు. ఈ వ్యాధికి సంబంధించి మొదట్లో తీవ్ర జ్వరం, వాంతులు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, పొడిదగ్గు లక్షణాలు కనిపిస్తాయని విశాఖ KGH సూపరింటెండెంట్‌ వాణి తెలిపారు. మరోవైపు.. ఎలుకలు సంచరించే ప్రాంతాలు, పొలాలు, పొదలు, గడ్డివాములు ఉండే చోట్ల స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి ఆనవాళ్లుంటాయి. ఇళ్లల్లో పాత మంచాలు, పరుపులు, దిండ్లలోకి చొరబడే ప్రమాదం ఉంది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు