ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు. పన్ను ఎగవేతలను అరికట్టేందుకు కృత్రిమ మేధ (ఏఐ)ని ఉపయోగించాలని ఆదేశించారు. పన్ను వసూళ్లలో టెక్నాలజీని వినియోగించుకోవాలని, ఆన్‌లైన్ ప్రక్రియలను అమలు చేయాలని సూచించారు. అన్ని ఆదాయార్జన శాఖలు లక్ష్యాలను చేరుకోవాలని ఆయన అధికారులను కోరారు.
రాష్ట్ర ఆదాయం పెంచే అంశంపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టాలని అధికారులకు సూచించారు. పన్నుల వసూళ్లలో టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. పన్నుల వసూళ్లు పెరిగేలా ఆదాయార్జన శాఖలన్నీ పనిచేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆదాయార్జన శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మరిన్ని ఆదాయ మార్గాలను వెతకడంతో పాటు, ఎక్కడ ఆదాయం తక్కువగా నమోదవుతుందో దానికి గల కారణాలను వెతికి చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. పన్నుల చెల్లింపుల దగ్గర నుంచి రశీదులు, నోటీసులు జారీ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో జరగాలని చెప్పారు.
మున్సిపల్ శాఖ ఇచ్చిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా రాష్ట్రంలో వెయ్యి మందికి పైగా బిల్డర్లు అసలు రిజిస్టర్ కాలేదని ఏఐ గుర్తించిందని.. తప్పనిసరిగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ప్రభుత్వం ఎటువంటి ఆమోదాలైనా తెలపాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. పన్ను ఎగవేతదారులను పసిగట్టేందుకు ఏఐని వినియోగించుకోవాలని ఆదేశించారు.అన్ని ఆదాయార్జన శాఖల్లోనూ ఇదే తరహా ప్రక్రియ అమలు చేసి పకడ్బందీగా పన్ను వసూళ్లు చేయాలని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా వ్యాపారులకు పన్ను చెల్లింపులు, అనుమతులు వంటివి సులభతరం అవుతున్నాయనే విషయాన్ని వారికి తెలియజేయాలన్నారు. పన్నుచెల్లింపుదారులు, జీఎస్టీ పోర్టల్, ఏపీ రాష్ట్ర డేటా సెంటర్, ఏపీసీటీడీ.. ఇలా మొత్తం శాఖల సమాచారాన్ని ఏఐతో అనుసంధానించాలని చేయాలని అధికారులకు సూచించారు.
పన్ను చెల్లింపుదారులకు నోటీసుల జారీకి, గ్రీవెన్స్‌లు స్వీకరించడానికి ఏఐని వినియోగించి ప్రభుత్వ యంత్రాంగంలో మరింత వేగం పెంచాలన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రాష్ట్ర సొంత ఆదాయ లక్ష్యం రూ.1,37,412 కోట్లను 100 శాతం ఆర్జించేలా అన్ని శాఖలు కృషి చేయాలని అధికారులకు సూచించారు. మున్సిపల్ శాఖలో 2023-24 కంటే 2024-25లో రూ.500 కోట్లకు పైగా ఆదాయం అదనంగా వచ్చిందని.. పన్నులకు సంబంధించి ఇంకా సుమారు రూ.2,500 కోట్ల బకాయిలు ఉన్నాయని అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు.