ఏపీలోని పేద కుటుంబాలకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం… ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ

ఏపీలోని పేద కుటుంబాలకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం… ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల కోసం మరో మంచి అవకాశం. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లు ఇప్పటివరకు 3 కి.మీ పరిధిలో ఉన్న పిల్లలకు మాత్రమే లభించేవి. ఇప్పుడు ఆ పరిధిని 5 కి.మీకి పెంచింది ప్రభుత్వం. 1వ తరగతిలో 25% సీట్లు బలహీన వర్గాల పిల్లలకు కేటాయించారు.

విద్యా హక్కు చట్టం (RTE) కింద ఆంధ్రాలోని ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్ల కేటాయింపు పరిధిని ప్రభుత్వం విస్తరించింది. గతంలో ఒకటో తరగతిలో ఉచిత సీట్లు కేవలం 3 కి.మీ పరిధిలో ఉన్న విద్యార్థులకు మాత్రమే లభించేవి. తాజాగా ప్రభుత్వం ఆ పరిధిని 5 కి.మీ వరకు పెంచింది. దీంతో మరింత మంది పిల్లలు ఉచితంగా చదివే అవకాశం పొందుతున్నారు. ఈ సీట్ల ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. తల్లిదండ్రులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. మిగిలిన సీట్ల భర్తీ కోసం ప్రభుత్వం మూడో నోటిఫికేషన్ జారీ చేసింది. ఒకటో తరగతిలో 25% సీట్ల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఉన్న కొన్ని షరతులను ఈసారి సడలించారు.

సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ లేదా రాష్ట్ర సిలబస్‌ పాఠశాలల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేయవచ్చు. అనాథ పిల్లలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, హెచ్‌ఐవీ బాధితులు, మైనారిటీలు, తక్కువ ఆదాయం గల ఓసీ విద్యార్థులకు ఇది మంచి అవకాశం. సీబీఎస్‌ఈ/ఐసీఎస్‌ఈ/ఐబీ పాఠశాలల్లో చేరాలనుకుంటే.. పుట్టిన తేదీ 2019 ఏప్రిల్ 2 నుంచి 2020 మార్చి 31 మధ్యలో ఉండాలి. రాష్ట్ర సిలబస్ పాఠశాలల్లో చేరాలనుకుంటే.. బర్త్ డేట్ 2019 జూన్ 2 నుంచి 2020 మే 31 మధ్యలో ఉండాలి. బలహీన వర్గాల బీసీ, మైనారిటీ, ఓసీ గ్రామీణ ప్రాంతాల కుటుంబాల వార్షిక ఆదాయం రూ.1.20 లక్షలకు మించకూడదు. పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.1.44 లక్షలకు దాటకూడదు.

పాఠశాల ఎంపిక కోసం సచివాలయం, ఎంఈవో ఆఫీసు, మీ సేవ కేంద్రాలు లేదా ఇంటర్నెట్‌ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. మొదట ఒక కి.మీ పరిధిలో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, ఆ తర్వాత 5 కి.మీ పరిధిలో ఉన్న దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటారు. ఎంపికైన విద్యార్థుల పేర్లు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. తల్లిదండ్రుల ఆధార్ / ఓటరు ఐడీ / రేషన్ కార్డు లేదా ఇతర చిరునామా రుజువు పత్రాలు కావాల్సి ఉంటుంది. పిల్లల జనన ధృవీకరణ పత్రం కూడా ఉండాలి. దరఖాస్తులను ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు.. www.cse.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు