రైతులకు గుడ్ న్యూస్.. పట్టా పాస్ బుక్ లేకున్నా లోన్స్.. ఆ భయాలు వద్దన్న మంత్రి..

రైతులకు గుడ్ న్యూస్.. పట్టా పాస్ బుక్ లేకున్నా లోన్స్.. ఆ భయాలు వద్దన్న మంత్రి..

ఏపీలో రైతులకు ప్రభుత్వం ఉచితంగా కొత్త పట్టా పాస్ బుక్స్ పంపణీ చేయనుంది. ఎటువంటి తప్పులకు తావివ్వకుండా పాస్ బుక్స్ అందిస్తామని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. అంతేకాకుండా రైతులకు పంట రుణాల కోసం పాస్ బుక్స్ అవసరం లేదని మంత్రి వెల్లడించారు.

రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఉచితంగా పట్టాదారు పాస్‌బుక్‌లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి అనగాని సత్య ప్రసాద్ వెల్లడించారు. ఈ కొత్త పాస్‌బుక్‌లపై కేవలం ప్రభుత్వ లోగో మాత్రమే ఉంటుందని, ఎటువంటి రాజకీయ పార్టీల చిహ్నాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. తప్పులకు ఆస్కారం లేకుండా, అత్యంత జాగ్రత్తగా పరిశీలించి ఈ పాస్‌బుక్‌లను ముద్రించామన్నారు. ప్రస్తుతం 21 లక్షల పాస్‌బుక్‌లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

రికార్డులలోని తప్పుల పరిష్కారం
గత ప్రభుత్వం చేపట్టిన తొందరపాటు రీ-సర్వే కారణంగా భూ రికార్డులలో అనేక తప్పులు వచ్చాయని మంత్రి సత్య ప్రసాద్ ఆరోపించారు. వాటిని సరిచేయడానికి ప్రస్తుత ప్రభుత్వం పూర్తి దిద్దుబాటు చర్యలు చేపట్టిందని తెలిపారు. రైతుల ఫిర్యాదులను పరిష్కరించడానికి 6,688 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించామని.. అక్కడ వచ్చిన 2.79 లక్షల దరఖాస్తులను పరిష్కరించామని చెప్పారు. అదేవిధంగా 17,600 గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల ద్వారా 1.85 లక్షల ఫిర్యాదులు పరిష్కరించినట్లు చెప్పారు. రైతులకు భూ రికార్డులలో మార్పులు కోసం నాలుగు నెలల సమయం ఇచ్చామని, వాటిని లైవ్ వెబ్‌ల్యాండ్ డేటాబేస్‌లో అప్‌డేట్ చేశామని మంత్రి వివరించారు.

రైతులు ఆందోళన చెందొద్దు
కొత్తగా ముద్రించిన పాస్‌బుక్‌లలోని డేటా నేరుగా లైవ్ వెబ్‌ల్యాండ్ నుండి వస్తుందని.. ప్రింటింగ్ తర్వాత కూడా జాయింట్ కలెక్టర్ స్థాయిలో మరో రౌండ్ క్రాస్-వెరిఫికేషన్ జరుగుతోందని మంత్రి తెలిపారు. దాదాపు 50 శాతం పాస్‌బుక్‌లలో తప్పులు ఉన్నాయనే వార్తలను ఆయన ఖండించారు. ‘‘ఇప్పటివరకు తప్పులతో కూడిన ఒక్క పాస్‌బుక్ కూడా జారీ చేయలేదు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని భరోసా ఇచ్చారు. కొత్తగా జారీ చేసిన పాస్‌బుక్‌లలో రైతులు ఏవైనా మార్పులు కోరితే, వాటిని నిబంధనల ప్రకారం ఉచితంగా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అస్పష్టమైన ఫోటోలు లేదా పేర్లు, జెండర్ వంటి వాటిలో ఉన్న చిన్నపాటి సమస్యలను కూడా పంపిణీకి ముందే సరిచేస్తున్నట్లు చెప్పారు.

పంట రుణాలు, కౌలు రైతుల సమస్యలు
పంట రుణాలు తీసుకోవడానికి కొత్త పాస్‌బుక్ తప్పనిసరి కాదని మంత్రి తెలిపారు. బ్యాంకులు లైవ్ వెబ్‌ల్యాండ్‌లోన్ ఛార్జ్ మాడ్యూల్‌ను ఉపయోగించి నిజమైన భూ యజమానిని గుర్తిస్తాయన్నారు. తద్వారా మోసాలు తగ్గుతాయని వివరించారు. పాస్‌బుక్‌లు లేకపోవడం వల్ల రైతులకు రుణాలు విషయంలో ఆలస్యం జరగదని అన్నారు. అలాగే కౌలు రైతుల పేర్లు భూ యజమానులుగా పాస్‌బుక్‌లలో ముద్రిస్తారనే వాదనలను మంత్రి తోసిపుచ్చారు. ఈ సిస్టమ్ అధికారిక 1B (ROR) మాస్టర్ రికార్డుల నుండి మాత్రమే పేర్లను ప్రింట్ చేస్తుందని.. కౌలుదారుల జాబితా ఇందులో ఉండదన్నారు. ఈ చర్యల ద్వారా రైతులకు భూ రికార్డుల విషయంలో పూర్తి స్పష్టత, భద్రత లభిస్తుందని మంత్రి సత్య ప్రసాద్ అన్నారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు