ప్రతీనెల 1వ తారీఖున ఇంటింటికీ పింఛన్ పంపిణీ విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతి నెలా ఒకటో తేదీన ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం వరకు పంపిణీ చేస్తున్న పింఛన్ కార్యక్రమం సమయాలను ప్రభుత్వం మార్చివేసింది. ఒకటో తేదీన తెల్లవారుజాము నుంచే పింఛన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం ఎక్కడా నిబంధనలు పెట్టలేదనీ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీనెల 1వ తారీఖున ఠంఛనుగా పింఛన్ పంపిణీ కార్యక్రమం అమలవుతున్న సంగతి తెలిసిందే. గత సర్కార్ తీసుకువచ్చిన ఇంటింటికీ పింఛన్ పంపిణీ విధానం కొత్తగా అధికారం చేపట్టిన కూటమి సర్కార్ కూడా అమలు చేస్తుంది. సచివాలయ సిబ్బంది ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతి నెలా ఒకటో తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ పంపిణి సమయాల్లో వెసులుబాటు కల్పిస్తూ ప్రకటన జారీ చేసింది. ఒకటో తేదీన తెల్లవారుజాము నుంచి పింఛన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం ఎక్కడా నిబంధనలు పెట్టలేదు. అయినా అధిక జిల్లాల్లో ఉదయం 4, 5 గంటల నుంచే పింఛన్ పంపిణీ చేస్తున్నారు. ఇది అటు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతోపాటు లబ్ధిదారులు కూడా ఇబ్బంది పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి.
దీనిపై స్పందించిన ప్రభుత్వం పింఛన్ పంపిణీ సమయాల్లో మార్పులు చేసింది. ఇకపై ప్రతీ నెల ఒకటో తేదీన ఉదయం ఉదయం 7 గంటల నుంచి పింఛన్ పంపిణీ ప్రారంభించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. అంతేకాకుండా ఆ సమయానికి మాత్రమే యాప్ పనిచేసేలా మార్పులు చేసింది. పెన్షనర్ల సౌలభ్యం కోసం ప్రభుత్వం ఈ మార్పులు చేస్తున్నట్లు సెర్ఫ్ సీఈవో వాకాటి కరుణ తెలిపారు. ఇందులో టైమింగ్స్తోపాటు పెన్షన్ల పంపిణీలో నాణ్యత, పెన్షన్ దారుల సంతృప్తి మెరుగుపర్చేందుకుగానూ పెన్షన్ల పంపిణీ యాప్‌లో మరికొన్ని మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
లబ్ధిదారుల ఇళ్ల వద్ద నుంచి 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పంపిణీ చేస్తుంటే ఏ కారణం చేత అంత దూరంలో పింఛన్ పంపిణీ చేస్తున్నారో వివరణ ఇచ్చేలా మార్పులు చేశారు. ఆసుపత్రులు, పాఠశాలలు, కాలేజీల్లో ఉన్న దివ్యాంగ విద్యార్థులకు, ఉపాధి హామీ పని ప్రదేశాల్లో పింఛను పంపిణీ చేసినా నమోదుకు అవకాశం కల్పించింది. అంతేకాకుండా పింఛన్ పంపణీ యాప్‌లో 20 సెకన్ల ప్రభుత్వ సందేశాన్ని ఆడియో రూపంలో యాప్‌లో ప్లే చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. లబ్ధిదారుల వివరాలు నమోదు చేసిన వెంటనే ఇది ఆటోమెటిక్‌గా ప్లే అవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటంతో తొలుత మార్చి 1వ తేదీన చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ప్రారంభించనున్నారు. ఎన్నికల కోడ్ ముగిశాఖ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, అన్ని సచివాలయాలు, ఇతర అధికారులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.