ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం డబ్బు ముందే కట్టే పనిలేదు – సర్కార్ కీలక నిర్ణయం

ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం డబ్బు ముందే కట్టే పనిలేదు – సర్కార్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం 2 పథకంలో కీలక మార్పు చేసింది. ఇకపై లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే చాలు. రాయితీ డబ్బులు ముందుగా ఖాతాల్లో జమ అవుతాయి. ముందుగా డబ్బులు చెల్లించే అవసరం ఇక లేదు. ప్రస్తుతం ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా రెండు జిల్లాల్లో అమలు చేస్తున్నారు.

ఏపీలోని కూటమి సర్కార్ దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ విధానంలో కీలక మార్పు తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ లబ్ధిదారులు సిలిండర్ బుక్ చేసుకుని ముందుగా డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. ఆ తరువాతే రాయితీగా ప్రభుత్వం ఇచ్చే సొమ్ము బ్యాంకు ఖాతాల్లో జమవుతూ ఉండేది. ఇకపై ఆ విధానం పూర్తిగా మారనుంది. లబ్ధిదారులు సిలిండర్ బుక్ చేసిన వెంటనే, తగిన రాయితీ మొత్తం ప్రభుత్వమే లబ్ధిదారుల డిజిటల్ వాలెట్ లేదా బ్యాంక్ ఖాతాలో ముందుగా జమ చేస్తుంది. ఆ డబ్బులతో వారు గ్యాస్ ఏజెన్సీకి చెల్లించవచ్చు. అంటే… ఇకపై ఒక్క రూపాయి కూడా ముందుగా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది మహిళలకు కొంత మేరకు ఆర్థిక ఊరట కలిగించే మార్గంగా భావిస్తున్నారు.

ఈ మార్పును ప్రస్తుతం ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని ఆరు గ్యాస్ ఏజెన్సీల పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇది విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న గ్యాస్ ఏజెన్సీల సహకారంతో ఈ పైలట్ ప్రాజెక్ట్ చేపట్టినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

ప్రస్తుతం అర్హులకు కూటమి ప్రభుత్వం ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు అందిస్తోంది. కానీ రాయితీ జమ కావడంలో ఆలస్యంతో వినియోగదారుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. అందుకే కొత్త విధానం ద్వారా చక్కని సేవలందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మరి ఈ ఆవిష్కరణ ఎక్కడికీ తీసుకెళ్తుందో చూడాలి.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు