ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి గతంలో తన భర్త దినచర్యను ప్రజలతో పంచుకున్నారు. ఆయన ఉదయం 4-4:30 గంటలకు నిద్రలేచి ప్రాణాయామం, వ్యాయామం చేస్తారట. మరి ఆయన ఎక్కువగా ఏం తింటారు..? డైట్‌కి ఆయన ఇచ్చే ప్రాధాన్యత ఎంతో ఈ కథనంలో తెలుసుకుందాం…
ఆంధ్రా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దినచర్య, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి నారా భువనేశ్వరి గారు గతంలో ఓ సందర్భంలో వివరించారు. చంద్రబాబు నాయుడు అత్యంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని, ఆయన దినచర్యను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆమె ఆకాంక్షించారు. భువనేశ్వరి ఇచ్చిన వివరాల ప్రకారం.. చంద్రబాబు నాయుడు సాధారణంగా ఉదయం 4 నుంచి 4:30 గంటల మధ్య నిద్రలేస్తారు. అయితే, ఒక్కోసారి అర్ధరాత్రి 12 లేదా ఒంటి గంట వరకు పని చేయాల్సి వస్తే, ఆ మేరకు అదనంగా రెండు నుంచి మూడు గంటల విశ్రాంతి తీసుకుంటారని ఆమె తెలిపారు. ఉదయం నిద్రలేచిన తర్వాత సీఎం.. ప్రాణాయామం, కార్డియో, స్ట్రెంథెనింగ్ వర్కవుట్లతో కూడిన వ్యాయామాలను క్రమం తప్పకుండా చేస్తారు. వ్యాయామం అనంతరం అల్పాహారం తీసుకుని తన దైనందిన కార్యకలాపాలను ప్రారంభిస్తారు. సీఎం గతంలో సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల కొన్ని ఎసిడిటీ సమస్యలు ఎదుర్కొన్నారని, ఆ తర్వాత ఆయన సమయానికి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకున్నారని ఆమె తెలిపారు.
సీఎం డైట్ ఏంటంటే..?
సీఎం చంద్రబాబు నాయుడు తన ఆహారపు అలవాట్లు, ఆరోగ్య సంరక్షణ విధానాలపై మొన్నామధ్య మాట్లాడారు. ప్రస్తుతం చాలా మంది కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న వరి అన్నం తినడం తగ్గించారని, తాను కూడా రైస్ కాకుండా కూరగాయలు, ప్రోటీన్‌తో కూడిన ఆహారానికి అలవాటు పడ్డానని తెలిపారు. తన వ్యక్తిగత దినచర్యలో భాగంగా, ఉదయం అల్పాహారం తీసుకోకుండా కేవలం ఆమ్లెట్ మాత్రమే తీసుకుంటానని, ఇది తాను తన జీవితంలో చేసుకున్న ఒక ప్రధాన మార్పు అని వివరించారు. ఇక సాయంత్రం ఆయన ఆరున్నర, ఏడు లోపు డిన్నర్ కంప్లీట్ చేస్తారట. ఈ ఆహారపు అలవాట్ల వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని, షుగర్ వంటి సమస్యలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రజలు కూడా ఆహారపు అలవాట్లను పంచుకుంటూ, ఆరోగ్యానికి పౌష్టికాహారం, జీవనశైలి ముఖ్యమని తెలిపారు. రైస్ నుంచి ప్రోటీన్, మిల్లెట్స్, పండ్లు, కూరగాయలకు మారాలని సూచించారు.
తాను వ్యక్తిగతంగా తన ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవడానికి సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. ఆరా రింగ్ ధరించి నిద్ర నాణ్యత, హృదయ స్పందన రేటు, శరీర సంసిద్ధతను పరిశీలిస్తానని చెప్పారు. శరీర సంసిద్ధత తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువసేపు నిద్రపోతానని పేర్కొన్నారు. అలాగే, అల్ట్రా హ్యూమన్ సెన్సార్ ద్వారా గ్లూకోజ్ స్థాయిలను తెలుసుకుని, అవసరాన్ని బట్టి ఆహారాన్ని తీసుకుంటానని స్పష్టం చేశారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని ఈ సందర్భంగా ఆయన సందేశం ఇచ్చారు.

