‘టెట్‌ పరీక్ష నుంచి టీచర్లకు మినహాయింపు ఇవ్వాల్సిందే’.. ఏఐఎస్టీఎఫ్‌ డిమాండ్‌

‘టెట్‌ పరీక్ష నుంచి టీచర్లకు మినహాయింపు ఇవ్వాల్సిందే’.. ఏఐఎస్టీఎఫ్‌ డిమాండ్‌

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వచ్చే రెండేళ్లలో ప్రస్తుతం సర్వీసులో ఉన్న టీచర్లంతా టెట్‌లో అర్హత సాధించకుంటే వారంతా ఉద్యోగాలు కోల్పోవల్సి ఉంటుంది. దీంతో ఏపీ, తెలంగాణతో సహా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టెట్‌’ నుంచి మినహాయింపునివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆల్‌ ఇండియా సెకండరీ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఏఐఎస్టీఎఫ్‌)..

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) పరీక్ష.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విధుల్లో ఉన్న ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు కంటి మీద కునుకునలేకుండా చేస్తుంది. టీచర్లకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు గతంలో చారిత్రక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. వచ్చే రెండేళ్లలో ప్రస్తుతం సర్వీసులో ఉన్న టీచర్లంతా టెట్‌లో అర్హత సాధించకుంటే వారంతా ఉద్యోగాలు కోల్పోవల్సి ఉంటుంది. దీంతో ఏపీ, తెలంగాణతో సహా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టెట్‌’ నుంచి మినహాయింపునివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆల్‌ ఇండియా సెకండరీ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఏఐఎస్టీఎఫ్‌) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జి సదానందం గౌడ్ అధ్యక్షతన ఆదివారం రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఏఐఎస్టీఎఫ్‌ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టెట్‌ మినహాయింపు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీనికి పలు రాష్ట్రాల నుంచి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

విద్యాహక్కు చట్టం అమలు తేదీకి ముందు నియామకమైన ఉపాధ్యాయులంతా రెండేళ్లలో టెట్‌ పాస్‌ కావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేయాలని అన్నారు. అఖిలభారత జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆఫ్‌ టీచర్‌ ఆర్గనైజేషన్స్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి ఉద్యమం నిర్వహిస్తున్నట్లు తమ ప్రకటనలో వెలువరించారు.

కాగా 2011 నుంచి ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించే వారందరికీ టెట్ అర్హతను తప్పనిసరి చేశారు. అయితే ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం వీరితోపాటు ప్రస్తుతం సర్వీసులో ఉన్నవారంతా ఖచ్చితంగా రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణత పొందాలి. ఈ నిబంధన 2011 కంటే ముందు నుంచి విధుల్లో ఉన్న సీనియర్ ఉపాధ్యాయులకు సవాలుగా మారింది. దశాబ్దాల కాలంగా బోధన చేస్తూ.. పదవీ విరమణకు దగ్గరగా ఉన్న వారు కొత్తగా పరీక్ష రాయడం కష్టతరమని ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు పిటిషన్లు దాఖలు చేశాయి. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఏపీలో తొలిసారి టెట్ నోటిఫికేషన్‌ రావడంతో పలువురు ప్రభుత్వ టీచర్లు టెట్ పరీక్షలు రాశారు. మరోవైపు తెలంగాణలోనూ ప్రస్తుతం టెట్‌ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలకు కూడా సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు హాజరవుతున్నారు. అయితే ‘టెట్‌’కు హాజరయ్యేందుకు టీచర్లకు ఆన్‌ డ్యూటీ (ఓడీ) సౌకర్యం కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్‌ నికోలస్‌ తాజాగా ఉత్తర్వులు సైతం జారీ చేశారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు