నాకేం చేయాలో తెలియడం లేదు.. వెక్కి వెక్కి ఏడ్చిన సదా.. ఎందుకంటే..

నాకేం చేయాలో తెలియడం లేదు.. వెక్కి వెక్కి ఏడ్చిన సదా.. ఎందుకంటే..

హీరోయిన్ సదా.. తెలుగు సినీప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు వరుస సినిమాలతో సౌత్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్. తెలుగు, తమిళం భాషలలో స్టార్ హీరోస్ అందరితో నటించి మెప్పించింది. 41 ఏళ్ల వయసులో ప్రేమ, పెళ్లికి దూరంగా ఉంటుంది. తాజాగా తన ఇన్ స్టాలో ఏడుస్తూ ఓ వీడియో షేర్ చేసింది. అసలేం జరిగిందంటే..

దక్షిణాది సినీప్రియులకు హీరోయిన్ సదా సుపరిచితమే. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. జయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. ఫస్ట్ మూవీతోనే భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ బ్యూటీకి తెలుగులో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఇదిలా ఉంటే.. కొన్నాళ్లుగా సదా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా మారింది. తాజాగా తన ఇన్ స్టాలో ఏడుస్తూ ఓ వీడియో రివీల్ చేసింది. తనకు ఏం చేయాలో అర్థం కావడంలేదని.. ఆలోచిస్తుంటే తన మనసు ముక్కలు అవుతుందని చెప్పుకొచ్చింది.

అసలు విషయానికి వస్తే.. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో అన్ని కుక్కలను 8 వారాల్లోగా షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు సోమవారం (ఆగస్ట్ 11) ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎవరైనా దీన్ని అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించింది. అయితే న్యాయస్థానం తీర్పుపై సినీతారలు సోషల్ మీడియా వేదికగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ సదా మాట్లాడుతూ.. “ఒక్క రేబిస్ కేసు కోసం దాదాపు 3 లక్షల కుక్కల్ని సిటీనుంచి తరలిస్తారు. లేదా చంపేస్తారు. 8 వారాల్లో శునకాల కోసం ప్రభుత్వం షెల్టర్స్ ఎక్కడ ? ఎలా సిద్ధం చేయగలదు ? ఇది జరగని పని. వాటికి ఆశ్రయం కల్పించడం కుదరదు. కాబట్టి వాటన్నింటిని చంపేస్తారు. మున్సిపల్ ఆఫీస్, గవర్నమెంట్.. వాటికి వ్యాక్సిన్ వేయకుండా ఏం చేసింది. ? ఏబీసీ ప్రోగ్రామ్ కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.” అని అన్నారు.

“కొన్ని ఎన్జీవోలు తమ పరిధిలో ఉన్న కుక్కలు , పిల్లుల సంఖ్య పెరగకుండా తమ శక్తిమేర ప్రయత్నిస్తున్నారు. వాటికి ఆరోగ్యం బాగోలేదంటే మేము డబ్బులు ఇచ్చి చికిత్స అందిస్తున్నారు. కానీ వాటి కోసం ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. వీధుల్లో శునకాల కోసం ఆలోచిస్తేనే మనసు ముక్కలవుతుంది. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఎక్కడ ఎలా నిరసన చేయాలి అనేది తెలియడం లేదు. కానీ ఈ తీర్పు మాత్రం నన్ను లోలోపలే చంపేస్తోంది. వాటిని చంపడం కరెక్ట్ కాదు. దయచేసి ఆ తీర్పు వెనక్కు తీసుకోండి” అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీస్ ఈ తీర్పును వ్యతిరేకిస్తున్నారు.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు