వెండి ధరలపై మరో బిగ్ బాంబ్.. బడ్జెట్‌లో షాకింగ్ న్యూస్..! ధరలు ఆగేదేలే..

వెండి ధరలపై మరో బిగ్ బాంబ్.. బడ్జెట్‌లో షాకింగ్ న్యూస్..! ధరలు ఆగేదేలే..

వెండి ధరలపై మరో షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఇప్పటికే వెండి ధరలు చరిత్రలో గరిష్ట స్థాయి రికార్డును నమోదు చేశాయి. బుధవారం రూ.13 వేలు పెరిగి కేజీ వెండి 4 లక్షలకు చేరుకుంది. రానున్న రోజుల్లో మరింతగా పెరగనుంది. దీనికి కారణం సుంకాలే..

అంతర్జాతీయ స్ధాయిలో ఆర్ధిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితి వంటి కారణాలతో పసిడి ధరలు రెచ్చిపోతున్నాయి. ఇన్వెస్టర్లు బంగారం, వెండి వైపు పెట్టుబడులకు మొగ్గు చూపడంతో చారిత్రాత్మక ర్యాలీని కొనసాగిస్తున్నాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో బలమైన కొనుగోళ్ల కారణంగా ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి రేట్లు బుధవారం ఆల్ టైం రికార్డును క్రియేట్ చేశాయి. ఇక వెండి ధర ఒక్కరోజే 7 శాతం కంటే ఎక్కువ పెరిగి సరికొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. ఎంసీఎక్స్‌లో వెండి రేట్లు 2.4 శాతం పెరిగి కిలోకు రూ.3,64,821 వద్ద ఇవాళ ప్రారంభమవ్వగా.. ఇది 6 శాతం పెరిగి రూ.3,83,100కి చేరుకున్నాయి.

డాలర్ ఎఫెక్ట్
అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ప్యూచర్స్ ఔన్సుకు 7.3 శాతం పెరిగి 113.66 డాలర్లకు చేరుకుంది. ఇక స్పాట్ సిల్వర్ ధర 1.41 శాతం పెరిగి ఔన్సుకు 113.714 డాలర్లకు చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు, నిర్ణయాలతో డాలర్ విలువ పడిపోతుంది. డాలర్ విలువ నాలుగు సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్ కుప్పకూలడంపై తాను ఎటువంటి ఆందోళన చెందటం లేదని ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత డాలర్ విలువ మరింతగా పతనమైంది. దీంతో బంగారం, వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి.

సుంకాలు పెంపు
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వెండి మార్కెట్‌గా భారత్ ఉంది. దాదాపు 80 శాతం వెండిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. 2025లో వెండి దిగుమతులు 44 శాతం పెరగ్గా.. 9.2 బిలియన్లకు చేరుకున్నాయి. గత ఏడాదిలో విదేశీ మారక నిల్వలో దాదాపు పదో వంతు బంగారం, వెండిపై భారత్ ఖర్చు చేసింది. ఈ ఏడాదిలో దిగుమతి బిల్లు మరింత పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వం దిగుమతి సుంకాలను పెంచడం వల్ల వెండి రేట్లు మరింతగా పెరుగుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోడం, వాణిజ్య లోటు పెరుగుతుండటంతో వెండి దిగుమతులపై ప్రభుత్వం మరోసారి దిగుమతి సుంకాలను పెంచే అవకాశముందని తెలుస్తోంది.

వెండి 4 లక్షల మార్క్
రూపాయి విలువ పతనాన్ని అరికట్టేందుకు సుంకాలను పెంచేందుకు కేంద్రం రెడీ అవుతుందని చెబుతున్నారు. ఇదే జరిగితే వెండి ధరలు మరింత పెరగవచ్చు. బడ్జెట్‌లో దీనిపై నిర్ణయం ఉండొచ్చని, లేదా బడ్జెట్ తర్వాత అయినా పెంపు రావచ్చని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి 4 లక్షల మార్క్‌కు చేరుకోగా.. నిన్న ఈ ధర రూ.3,87,000గా ఉంది. నిన్నటితో పోలిస్తే బుధవారం ఏకంగా రూ.13 వేలు పెరిగింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Please follow and like us:
బిజినెస్ వార్తలు