తెలంగాణ ప్రభుత్వం డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల జారీకి కొత్త సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఇక నుంచి వాటి జారీ ప్రక్రియ వేగవంతం కానుంది. దీంతో ప్రజలు సులువుగా ఆ సర్టిఫికేట్లు పొందే అవకాశం లభించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇది లాంచ్ అయింది.
ఆధార్ కార్డు పొందాలన్నా లేదా ఆధార్‌లో డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవాలన్నా జనన ధృవీకరణ పత్రం అనేది తప్పనిసరిగా అవసరం. ఇక పాస్‌పోర్ట్ పొందాలన్నా లేదా ఇతర ప్రభుత్వ సేవలకు జనన ధృవీకరణ పత్రం అనేది ఉపయోగపడుతుంది. డేట్ ఆఫ్ బర్త్ లేదా డెత్ సర్టిఫికేట్ పొందాలంటే ఇప్పటివరకు కఠిన నిబంధనలు అమల్లో ఉండేవి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అధికారులు పరిశీలన చేపట్టి డేట్ ఆఫ్ బర్త్ లేదా డెత్ సర్టిఫికేట్ జారీ చేయడానికి చాలా రోజుల సమయం పట్టేంది. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ల జారీ మరింత వేగవంతం కానుంది. ప్రజలు సులవుగా వీటిని పొందేలా కొత్త సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. తొలుత జీహెచ్ఎంసీ పరిధిలో దీనిని తీసుకొచ్చారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్త సేవలు
నగరవాసులు డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్లు సులభంగా పొందేలా జీహెచ్‌ఎంసీ కొత్త అప్లికేషన్ తీసుకొచ్చింది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహయంతో నూతన సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టింది. తాజాగా ఈ అప్లికేషన్‌ను జీహెచ్‌ఎంసీ పరిధిలో లాంచ్ చేశారు. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా నగరంలోని అన్ని ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లను అనుసంధానం చేశారు. దీంతో ఏదైనా ప్రాంతంలో జననం లేదా మరణం జరిగినా వెంటనే సంబంధిన వార్డు పరిధిలో ఆటోమేటిక్‌గా నమోదు అవుతుంది. జవనం లేదా మరణం జరిగిన 21 రోజుల్లో ఆస్పత్రులు లేదా కుటుంబసభ్యులు వివరాలను నమోదు చేయాలి. గతంలో ఆస్పత్రుల నుంచి నేరుగా అధికారులు సమాచారం అడగడం వల్ల ప్రక్రియ ఆలస్యమయ్యేది. కానీ ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా ఆటోమేటిక్‌గా వివరాలను నమోదయ్యే ప్రక్రియ ప్రవేశపెట్టారు.
మీ సేవ కేంద్రాల ద్వారా పొందే అవకాశం
ఈ కొత్త అప్లికేషన్ ద్వారా వివరాలు వెంటనే నమోదు కావడం వల్ల వెరిఫికేషన్ ప్రక్రియ త్వరగా పూర్తవుతుంది. దీంతో మీ సేవా కేంద్రాల ద్వారా ప్రజలు సులవుగా డేట్ ఆఫ్ బర్త్ లేదా డెత్ సర్టిఫికేట్లను పొందవచ్చన్నమాట. ఇక పేరు, అడ్రస్ మార్పులు కూడా ఈ సాఫ్ట్‌వేర్ వల్ల సులభతరం కానున్నాయి. హైదరాబాద్ ప్రజలందరూ ఈ సేవలను ఉపయోగించుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇటీవల జీహెచ్‌ఎంసీ పరిధిలోకి కొత్తగా 20 మున్సిపాలిటీలు వచ్చాయి. దీంతో వార్డు సంఖ్య కూడా పెరిగింది. గతంలో 150 వార్డులు ఉండగా.. ఇప్పుడు 300కి పెరిగాయి. దీంతో పాత విధానం ద్వారా సర్టిఫికేట్లను జారీ చేయడం కష్టతరంగా మారింది. దీంతో ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చిందని చెప్పవచ్చు.

