బంగారం, వెండి ధరల్లో ఇటీవల రాత్రికి రాత్రి భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒక్కసారి ధరలు పెరుగుతున్నాయి. అలాగే అదే రీతిలో మరుసటి రోజు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాల కారణంగా గోల్డ్ రేట్లు మారుతున్నాయి. బంగారం, వెండి ధరలు పెరగడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి.
బంగారం రేట్లు చరిత్రను తిరగరాస్తున్నాయి. రికార్డులు బద్దలు కొడుతూ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి. గత ఏడాది బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్‌కు చేరుకోగా.. 2026లో ఆ రికార్డును అధిగమించి జీవితకాలపు గరిష్ట స్థాయిని నమోదు చేయనున్నాయి. ఈ వారంలో బంగారం రేట్లు రూ.1.55 లక్షలను క్రాస్ చేయగా.. త్వరలో రూ.1.60 లక్షల మార్క్‌ను క్రాస్ చేసేందుకు చేరువలో ఉన్నాయి. బుధవారం ఏకంగా రూ.7 వేల వరకు ఒక్కసారిగా పెరగ్గా.. గురువారం రూ.2300 వరకు కుప్పకూలాయి. దీంతో బంగారం ధరల్లో వస్తున్న ఊహించని మార్పులతో ఏ రోజు తగ్గుతుందో.. ఏ రోజు పెరుగుతుందో ఇన్వెస్టర్లు, కొనుగోలుదారులకు అర్ధం కాక అయోమయానికి గురవుతున్నారు.
గోల్డ్ రేట్లు పెరగడానికి 5 కారణాలు..
-2025 మే 5న బంగారం రేట్లు రూ.93,540గా ఉంది. వెండి ధర 10 గ్రాముల రూ.1170గా ఉంది. ఏడాదిలోనే బంగారం, వెండి ధరలు ఎవరూ ఊహించనంతగా మారిపోయాయి
-బంగారం ధర పెరగడానికి అంతర్జాతీయ ఉద్రిక్తతలే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య ఉద్రిక్తతలు, యుద్దాలు చోటుచేసుకోవడంతో పెట్టుబడిదారులు బంగారం, వెండిలో పెట్టుబడులు ఎక్కువగా పెడుతున్నాయి. ఇన్వెస్ట్‌మెంట్స్ ఎక్కువకావడం వల్ల వీటి ధరలు పెరుగుతున్నాయి.
-ఇక చైనా, ఇతర అభివృద్ది చెందుతున్న దేశాల్లో కేంద్ర బ్యాంకులు వతమ విదేశీ నిల్వలను పెంచుకోవడానికి బంగారం, వెండిని భారీగా కొనుగోలు చేస్తున్నాయి. ధరల పెరుగుదలకు ఇదొక కారణంగా చెప్పవచ్చు
-అలాగే ప్రధాన కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తాయనే సంకేతాలతో పెట్టుబడిదారులు బంగారం, వెండి వైపు చూస్తున్నారు. ధరల పెరగడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తోంది.
-దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. దీంతో బంగారం, వెండి ఆధారిత ఈటీఎఫ్‌లు, డిజిటల్ ఆస్తులలో పెట్టుబడులు పెట్టేందుకు భారతీయులు ఆసక్తి చూపిస్తున్నారు. దేశంలో ధరల పెరుగుదలకు ఇది కూడా కారణం
-ఇక భౌతికంగా బంగారంను కొనుగోలు చేసేవారు తగ్గిపోయారు. కానీ ఆర్ధిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం గురించి ఆందోళనల క్రమంలో పసిడిపై పెట్టుబడులు పెరగడంతో ధరలు పెరుగుతున్నాయి.
ఏడాదిలో 2 లక్షలకు చేరుకుంటుందా..?
2026లో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానన్న రోజుల్లో మరింతగా పెరిగి తులం 2 లక్షలకు కూడా చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టేవారు భారీగా లాభపడనున్నారు. ఇక వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. దీంతో వెండిలో పెట్టుబడి పెట్టేవారికి కూడా లాభం జరగనుందని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు.

