సీబీఎస్సీ అన్ని అనుబంధ సెకండరీ, సీనియర్ సెకండరీ పాఠశాలల్లో అర్హత కలిగిన కౌన్సెలింగ్, వెల్‌నెస్ టీచర్లు, కెరీర్ కౌన్సెలర్ల నియామకాన్ని తప్పనిసరి చేస్తూ దాని అనుబంధ ఉప-చట్టాలను సవరించింది. ఈ మేరకు తాజాగా ప్రకటన జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో అటువంటి అన్ని..
విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) మరో కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డు అందించే కౌన్సెలింగ్ సేవలపై ఇప్పటికే ఉన్న నిబంధనలను సవరించింది. ఇకపై సీబీఎస్సీ అనుబంధ పాఠశాలలు తమ స్కూళ్లలో చదివే విద్యార్ధుల మానసిక ఆరోగ్యం, కెరీర్ మార్గదర్శక వ్యవస్థలను బలోపేతం చేయడం తప్పనిసరి చేసింది. సీబీఎస్సీ అన్ని అనుబంధ సెకండరీ, సీనియర్ సెకండరీ పాఠశాలల్లో అర్హత కలిగిన కౌన్సెలింగ్, వెల్‌నెస్ టీచర్లు, కెరీర్ కౌన్సెలర్ల నియామకాన్ని తప్పనిసరి చేస్తూ దాని అనుబంధ ఉప-చట్టాలను సవరించింది. ఈ మేరకు తాజాగా ప్రకటన జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో అటువంటి అన్ని సెకండరీ, సీనియర్ సెకండరీ పాఠశాలలు పూర్తి సమయం ప్రాతిపదికన వెల్‌నెస్ టీచర్లను (సామాజిక-భావోద్వేగ కౌన్సెలర్లు), కెరీర్ కౌన్సెలర్లను నియమించాలని కోరింది. గతంలో పాఠశాలలు పూర్తి సమయం లేదా పార్ట్ టైమ్ ప్రాతిపదికన కౌన్సెలర్లను నియమించుకునే వెసులుబాటును కలిగి ఉండేవి.
తాజా ఉత్తర్వుల మేరకు సీబీఎస్సీ స్కూళ్లలో 9వ తరగతి నుంచి 12వ తరగతులలో ప్రతి 500 మంది విద్యార్థులకు ఒక కౌన్సెలర్, వెల్‌నెస్ టీచర్, ఒక కెరీర్ కౌన్సెలర్‌ను నియమించాలి. అంటే ప్రతి 1,500 మంది విద్యార్థులు ఉన్న పాఠశాల కనీసం ముగ్గురు ఇటువంటి కౌన్సెలర్‌లను నియమించాల్సి ఉంటుంది. అయితే 300 కంటే తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలు పార్ట్‌టైమ్ ప్రాతిపదికన కౌన్సెలర్లను మునుపటి మాదిరిగానే కొనసాగవచ్చని పేర్కొంది.
పాఠశాలల్లో నాణ్యతను ప్రామాణీకరించే ప్రయత్నంలో భాగంగా అన్ని కౌన్సెలర్లు బోర్డు సూచించిన 50 గంటల సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలకు నిర్వహించాలి. వీటిలో మానసిక-సామాజిక కౌన్సెలింగ్, కెరీర్ కౌన్సెలింగ్ కూడా ఉన్నాయి. మనస్తత్వశాస్త్రం, సోషల్ వర్క్, స్కూల్ కౌన్సెలింగ్, సామాజిక-భావోద్వేగ అంశాల్లో విద్యా శిక్షణ పొందాలని బోర్డు కౌన్సెలర్లను ఆదేశించింది.

