తెలంగాణలోని మహిళలకు శుభవార్త, ప్రభుత్వం మహిళా సంఘాల అభివృద్దికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంఘాలకు విజయ డెయిరీ పార్లర్లు కేటాయించాలని నిర్ణయించింది. దీని ద్వారా మహిళలు ఆదాయం సంపాదించుకునే అవకాశం లభించనుంది. త్వరలో వీటి ఏర్పాటుకు అడుగులు పడనున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మహిళా సంఘాలకు గుడ్‌న్యూస్ అందించింది. వారిని ఆర్ధికంగా ప్రోత్సహించేందుకు డెయిరీ రంగంలో అవకాశాలు కల్పించనుంది. అందులో భాగంగా రాష్ట్రంలోని విజయ డెయిరీ పార్లర్లను మహిళలకు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఇందిరా మహిళా శక్తి పథకం పేరుతో దీనిని అమలు చేయనుంది. వారం పది రోజుల్లో ఈ పధకం అమలుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసి పార్లర్లను మహిళలకు కేటాయించనుందని తెలుస్తోంది.
ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యచరణ రెడీ అయింది. ప్రస్తుతానికి మండలానికి ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు విజయ డెయిరీ పార్లర్లు కేటాయించనున్నారు. ఇక మున్సిపాలిటీల్లో రెండు చొప్పున మహిళలకు కేటాయించే విధివిధానాలు రూపొందిస్తున్నారు. విజయ డెయిరీ పార్లర్ మహిళా సంఘాలు ఏర్పాటు చేసుకోవాలంటే పారిశ్రమాభివృద్ది సహకార సమాఖ్యకు రూ.వెయ్యి చెల్లించి దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మహిళలు పార్లర్ ఏర్పాటు కోసం స్థలాన్ని తీసుకోవాలి. అనంతరం రూ. 5 వేలు చెల్లిస్తే పార్లర్ మంజూరు చేస్తారు.
అంతేకాకుండా పార్లర్ ఏర్పాటు కోసం మహిళలకు రూ.5 లక్షల వరకు ఖర్చు కానుంది. ఇందుకోసం మహిళా సంఘాలకు ప్రభుత్వం లోన్లు ఇవ్వనుంది. ఈ పార్లర్ ఏర్పాటు చేసుకుంటే అందులో విజయ డెయిరీ ప్రొడక్ట్‌లను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. అందుకు అవసరమైన పదార్ధాలను విజయ డెయిరీ సరఫరా చేస్తూ ఉంటుంది. పాలు, పెరుగు, పన్నీర్, వాటర్ బాటిళ్లు వంటివి ఇందులో విక్రయించాల్సి ఉంటుంది. వీటి విక్రయం ద్వారా వచ్చే ఆదాయం మహిళల ఆర్ధికాభివృద్దికి సహాపడుతుంది. కాగా మహిళా సంఘాలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. వారికి ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంక్‌లు వంటివి కేటాయించింది. అలాగే మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేేసి వారి ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం కల్పిస్తోంది.

