సిడ్నీ బాండీ బీచ్‌ ఉగ్రదాడికి హైదరాబాద్‌ లింకులు

సిడ్నీ బాండీ బీచ్‌ ఉగ్రదాడికి హైదరాబాద్‌ లింకులు

సిడ్నీ బాండీ బీచ్ ఉగ్రదాడి కేసులో హైదరాబాద్ లింకులు బయటపడటం కలకలం రేపింది. కాల్పులు జరిపిన సాజిద్ అక్రమ్ స్వస్థలం హైదరాబాద్‌గా గుర్తించారు. అతని వద్ద భారత పాస్‌పోర్ట్ లభ్యం కావడంతో నిఘా సంస్థలు విచారణ ముమ్మరం చేశాయి .. ..

ఆస్ట్రేలియా లోని సిడ్నీ బాండీ బీచ్‌ ఉగ్రదాడి కేసులో హైదరాబాద్‌ లింకులు బయటకు రావడం తీవ్ర కలకలం రేపింది. బీచ్‌లో తన కుమారుడు నవీద్‌ అక్రమ్‌తో కలిసి కాల్పులు జరిపిన సాజిద్‌ అక్రమ్‌ స్వస్థలం హైదరాబాద్‌గా గుర్తించారు. సాజిద్‌ అక్రమ్‌ దగ్గర భారత పాస్‌పోర్ట్‌ లభించింది. 25 ఏళ్ల క్రితం సాజిద్‌ స్టూడెంట్‌ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే స్థిరపడినట్టు గుర్తించారు.

సాజిద్‌ కుటుంబసభ్యులను భారత నిఘా అధికారులు విచారించారు. ఆస్తి పంపకాల కోసం సాజిద్‌ గతంలో ఓసారి హైదరాబాద్‌కు వచ్చినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌ లోని టోలీచౌకీ ప్రాంతంలో సాజిద్‌ నివాసం ఉన్నట్టు గుర్తించారు. 2022లో తన ఆస్తులను అతడు అమ్ముకున్నట్టు తెలుస్తోంది. 50 ఏళ్ల సాజిద్‌ రెండుసార్లు మాత్రమే భారత్‌కు వచ్చినట్టు తెలుస్తోంది.

సిడ్నీ బాండీ బీచ్‌లో యూదుల వేడుకలను టార్గెట్‌ చేస్తూ సాజిద్‌ , నవీద్‌ కాల్పులు జరపడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కాల్పుల్లో సాజిద్‌ హతమయ్యాడు. నవీద్‌కు గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది.

సాజిద్‌ , నవీద్‌ నవంబర్‌ 1న ఫిలిప్పీన్స్‌కు వెళ్లినట్టు దర్యాప్తులో తేలింది. ఐసిస్‌ ఉగ్రవాదులకు అడ్డాగా ఉన్న దవానో పట్టణాన్ని వాళ్లిద్దరు సందర్శించారు. ఫిలిప్పీన్స్‌కు సాజిద్‌ , నవీద్‌ ఎందుకు వెళ్లారన్న విషయంపై దర్యాప్తు జరుగుతోంది.

Please follow and like us:
తెలంగాణ వార్తలు