హైదరాబాద్ నగరంలో మెస్సీ పర్యటన మొత్తం దాదాపు 2 గంటల పాటు మాత్రమే ఉండనున్నట్లు సమాచారం. ఇంత బిజీ షెడ్యూల్ లో ముగింపు కార్యక్రమంలో భాగంగా మెస్సీకి ప్రభుత్వం తరపున సన్మాన కార్యక్రమం ఉండనుంది. అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత మెస్సీ అదే రోజు రాత్రి తిరుగుప్రయాణమవుతారు.
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ త్వరలోనే హైదరాబాద్ నగరానికి రానుండడంతో ప్రస్తుతం అందరి దృష్టి అటు వైపే ఉంది. ఈ నెల 13వ తేదీన అంటే శనివారం రోజున మెస్సీ హైదరాబాద్ నగరంలో పర్యటించనుండడంతో క్రీడాభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఇదిలా ఉండగా.. లియోనెల్ మెస్సీ నగర పర్యటన వివరాలు ప్రస్తుతానికి గోప్యంగా ఉంచినప్పటికీ.. తాజ్‌లో బస చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా కోసం ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన విందుతో సహా అనేక ఉన్నత స్థాయి కార్యక్రమాలు హైదరాబాద్ నిజాం నివాసంలోనే జరిగాయి. 1894లో నిర్మించిన ఈ ప్యాలెస్‌ను 2010లో హోటల్‌గా మార్చారు. కొన్ని అనధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. డిసెంబర్ 13న సాయంత్రం 4 గంటలకు మెస్సీ నగరానికి చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఒక హోటల్‌కు చేరుకుని కొంతసేపు విశ్రాంతి తీసుకుంటారు. మెస్సీ హైదరాబాద్ పర్యటన పూర్తిగా క్రీడా సంబంధిత కార్యక్రమాలపైనే ఆధారపడి ఉందని సమాచారం.
డిసెంబర్ 13న మెస్సీ నగరంలో దిగిన తర్వాత.. అతనితో పాటు తన బృందం తాజ్ ఫలక్‌నుమాలో చెక్ ఇన్ చేస్తారు. సాయంత్రం మెస్సీ ఉప్పల్ స్టేడియంలో జరిగే విందులో పాల్గొంటారు. ఈ విందు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా పేరుగాంచిన మెస్సీ రాకతో హైదరాబాద్ నగరంలో ఫుట్‌బాల్ క్రీడకు ఒక కొత్త ఉత్తేజం, గుర్తింపు లభించనుంది. మెస్సీ పర్యటనలో ప్రధాన ఘట్టం సాయంత్రం 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. అక్కడ ఆయన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని టీమ్‌తో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనున్నారు. మ్యాచ్ అనంతరం మెస్సీ స్కూల్ పిల్లలతో ప్రత్యేకంగా ముచ్చటించేందుకు ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో మెస్సీ విద్యార్థులతో ముచ్చటించి తన అనుభవాలు, క్రీడా స్ఫూర్తి గురించి వారితో పంచుకుంటారు. మ్యాచ్ అనంతరం మెస్సీ మళ్లీ ప్యాలెస్‌కి తిరిగి చేరుకుంటాడు.
హైదరాబాద్ నగరంలో మెస్సీ పర్యటన మొత్తం దాదాపు 2 గంటల పాటు మాత్రమే ఉండనున్నట్లు సమాచారం. ఇంత బిజీ షెడ్యూల్ లో ముగింపు కార్యక్రమంలో భాగంగా మెస్సీకి ప్రభుత్వం తరపున సన్మాన కార్యక్రమం ఉండనుంది. అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత మెస్సీ అదే రోజు రాత్రి తిరుగుప్రయాణమవుతారు. కాగా, మెస్సీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో స్టేడియం పూర్తిగా నిండే అవకాశం ఉండనుండడంతో హైదరాబాద్ పోలీస్ శాఖ భద్రతా చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేకంగా పర్యవేక్షణ పనులను పరిశీలిస్తున్నారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు, రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ సహా తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.

