కేరళలోని ఎర్నాకుళం కోర్టులో నటుడు దిలీప్‌కు ఊరట..

కేరళలోని ఎర్నాకుళం కోర్టులో నటుడు దిలీప్‌కు ఊరట..

కేరళలో సంచలనం సృష్టించిన 2017 నాటి నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్‌ను కోర్టు నిర్దోశిగా ప్రకటించింది. ఎర్నాకులం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ఈ తీర్పును వెలువరించింది. కాగా తన ఇమేజ్‌ను, కెరీర్‌ను నాశనం చేయడానికే తన పేరును ఈ కేసులోకి లాగారని దిలీప్ కోర్టు బయట మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు.

మలయాళ సినీ పరిశ్రమను కుదిపేసిన నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసు ఎనిమిదేళ్ల తర్వాత కీలక మలుపు తిరిగింది. కేరళలో సంవత్సరాలుగా సాగుతున్న ఈ కేసులో ప్రముఖ నటుడు దిలీప్‌కు ఎర్నాకుళంలోని ప్రత్యేక కోర్టు నుంచి సోమవారం ఉపశమనం లభించింది. ఆయనపై ఉన్న అన్ని ఆరోపణలను కొట్టేసిన కోర్టు.. అతడ్ని నిర్దోశిగా ప్రకటించింది. అదే కేసులో నిందితులను ఉన్న ఆరుగురిని దోషులుగా తేల్చుతూ తీర్పు వెలువరించింది.

2017 ఫిబ్రవరి 17న మలయాళం, తమిళం, తెలుగు చిత్రాల్లో నటించిన ప్రముఖ నటి కిడ్నాప్‌కు గురైన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. కొచ్చి సమీపంలో జరిగిన ఆ ఘటనలో, దుండగులు ఆమెను కారు లోపలే రెండు గంటలపాటు వేధించారని విచారణలో బయటపడింది. ఈ దారుణంపై మొత్తం పది మందిపై కేసులు నమోదయ్యాయి. కిడ్నాప్, లైంగిక వేధింపులు, గ్యాంగ్‌రేప్, కుట్ర, ఆధారాలను నాశనం చేయడం వంటి అభియోగాలు వారిపై మోపారు. అదే ఏడాది జూన్‌లో ఫస్ట్ ఛార్జ్‌షీట్ దాఖలై, జులైలో దిలీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు నెలల తర్వాత ఆయన బెయిల్‌పై విడుదల అయ్యాడు.

తాను నిర్దోషినేనని అప్పటి నుంచే చెబుతూ వచ్చిన దిలీప్‌.. తాజా తీర్పు తర్వాత మీడియాతో మాట్లాడారు. తన మీద వచ్చిన ఆరోపణలు అన్నీ ఓ పెద్ద కుట్రగా పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో తన పక్కన నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని ఆయన తెలిపారు. 2018 మార్చి 8న ప్రారంభమైన ఈ కేసు విచారణ సుధీర్ఘకాలం సాగింది. మొత్తం 261 మంది సాక్షులను కోర్టు ముందుకు వచ్చారు. ఆ జాబితాలో పలువురు సినిమా ప్రముఖులు ఉండడం కేసుకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది. అయితే 28 మంది సాక్షులు విచారణ మధ్యలో వాంగ్మూలం మార్చుకోవడంతో ప్రాసిక్యూషన్‌పై ఒత్తిడి పెరిగింది. ఈ పరిణామాల్లో ఇద్దరు స్పెషల్‌ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రాజీనామా చేయడం కూడా కేసు మీద నీలినీడలు కమ్మేలా చేసింది. ప్రిసైడింగ్ జడ్జిని మార్చాలన్న వాదనను కోర్టు స్పష్టంగా తిరస్కరించింది. ప్రాసిక్యూషన్ మొత్తం 833 పత్రాలు, 142 మెటీరియల్ ఎగ్జిబిట్లను సమర్పించగా, డిఫెన్స్ 221 పత్రాలతో తమ వాదనను బలపరిచింది. సాక్షుల విచారణ మాత్రమే 438 రోజులు సాగడం ఈ కేసు ఎంత సంక్లిష్టంగా మారిందో తెలిపే అంశం.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు