కళ్ళముందే కనికట్టు చేసినట్లు రమణమ్మ అనే మహిళను మాటలతో ఏమార్చి 50 వేల రూపాయల కట్టలో 18 వేల రూపాయలు కొట్టేశారు. డబ్బులు తీసుకున్న దుండగులిద్దరూ హడావుడిగా బ్యాంకు నుంచి బయటకు నడుచుకుంటూ పారిపోయారు. అటు బాధితురాలు రమణమ్మ క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్లగా..
బ్యాంకులు, ఏటీఎం సెంటర్లలో ఎన్ని సీసీ కెమెరాలు పెట్టినా మోసగాళ్ల మోసాలకు అడ్డుకట్ట పడటం లేదు. డబ్బులు డిపాజిట్ చేసేందుకు డిపాజిట్ ఫారమ్ రాసిస్తామని ఓ మహిళను బురిడీ కొట్టించారు గుర్తు తెలియని దుండగులు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో కళ్లముందే కనికట్టు చేసినట్లు.. డబ్బులు ఎత్తుకెళ్లినా ఓ మహిళ గుర్తించలేకపోయింది. నల్ల చెరువుకు చెందిన రమణమ్మ అనే మహిళ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో 50 వేల రూపాయలు డిపాజిట్ చేసేందుకు బ్యాంకుకు వచ్చింది. డిపాజిట్ ఫారమ్ నింపిన రమణమ్మ 50 వేల రూపాయలతో పాటు డిపాజిట్ ఫారమ్, పాస్ బుక్ చేతిలో పట్టుకుని ఉంది. అంతలోనే ఓ ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తన దగ్గరకు వచ్చి డిపాజిట్ ఫారమ్ రాస్తామని చేతిలో ఉన్న పాస్ బుక్‌తో పాటు డబ్బులు కూడా తీసుకోగా.. అప్పటికే డిపాజిట్ ఫారమ్ రాశానని చెప్పినా.. పాస్‌బుక్‌తో పాటు గుర్తు తెలియని దుండగులు డబ్బులు తీసుకున్నారు.
కళ్ళముందే కనికట్టు చేసినట్లు రమణమ్మ అనే మహిళను మాటలతో ఏమార్చి 50 వేల రూపాయల కట్టలో 18 వేల రూపాయలు కొట్టేశారు. డబ్బులు తీసుకున్న దుండగులిద్దరూ హడావుడిగా బ్యాంకు నుంచి బయటకు నడుచుకుంటూ పారిపోయారు. అటు బాధితురాలు రమణమ్మ క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్లి పాస్‌పుస్తకంతో పాటు డిపాజిట్ ఫారమ్, నగదు క్యాష్ కౌంటర్లలో ఇచ్చింది. అయితే డిపాజిట్ ఫారమ్‌లో 50 వేల రూపాయలు రాసి ఉండగా నగదులో 18 వేల రూపాయలు తగ్గాయని క్యాషియర్ రమణమ్మకు చెప్పడంతో.. తన దగ్గరకు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులే డబ్బులు కొట్టేశారని గుర్తించింది. తన దగ్గరకు వచ్చి మాటల్లో పెట్టి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు డబ్బులు కొట్టేశారని బాధితురాలు రమణమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బ్యాంకు లోపలికి వచ్చి డబ్బులు కొట్టేసిన తర్వాత బయటకు వెళుతున్న నిందితుల దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. దీంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. దొంగలు ఉంటారు జాగ్రత్త.! అని బ్యాంకులలో ఎన్ని నోటీసు బోర్డులు పెట్టినా.. దొంగలు నేరుగా బ్యాంకులలోకి వచ్చి తమ చేతివాటం చూపిస్తున్నారు. ఏకంగా బ్యాంకులోకే దర్జాగా వచ్చి ఖాతాదారుల కళ్ళముందే డబ్బులు కొట్టేస్తున్నారు అంటే ఎంత ధైర్యం.!

