కార్మికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వారికి మరింత భరోసా కల్పిస్తూ కొత్త లేబర్ కోడ్లను ప్రవేశపెట్టింది. తప్పనిసరిగా అపాయింట్మెంట్ లెటర్స్, టైమ్‌కి శాలరీ, హెల్త్ ఇన్స్యూరెన్స్ వంటి ఎన్నో బెనిఫిట్స్ వీటి ద్వారా లభించనున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
కార్మికుల సంక్షేమానికి సంబంధించి కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కార్మికులకు భరోసా కల్పించేందుకు దేశంలో కొత్త లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. నవంబర్ 21 నుంచి ఈ రూల్స్ అమల్లోకి వస్తాయని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తన ఎక్స్ ఖాతాల్లో తెలిపారు. కార్మికులకు సకాలంలో కనీస వేతనాలు చెల్లించడంతో పాటు అపాయింట్మెంట్స్ లెటర్స్ ఇవ్వాలని సూచించింది. ఇక పురుషులతో పాటు మహిళలకు కూడా సమాన వేతనంతో పాటు గౌరవం కల్పించాలని తెలిపింది. ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకు ఒక సంవత్సరం తర్వాత గ్రాట్యూటీ సౌకర్యం కల్పించనున్నట్లు హామీ ఇచ్చింది.
40 ఏళ్లు పైబడిన కార్మికులకు సంవత్సరానికి ఒకసారి ఉచితంగా హెల్త్ చెకప్, ఓవర్ టైమ్ పనిచేసినవారికి డబుల్ వేతనం, ప్రమాదకర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు 100 శాతం ఆరోగ్య భద్రత, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కార్మికులకు సామాజిక న్యాయం కల్పిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఇక 40 కోట్ల మంది కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తామని తెలిపింది. నేటి నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త లేబర్ కోడ్స్ కార్మికులకు భద్రత కల్పిస్తాయని మాండవీయ స్పష్టం చేశారు.
నవంబర్ 21 నుంచి నాలుగు లేబర్ కోడ్స్‌ను అమలు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. వేతనాల నియమావళి, 2019, పారిశ్రామిక సంబంధాల నియమావళి 2020, సామాజిక భద్రత కోడ్, 2020, వృత్తి భద్రత, ఆరోగ్యం , పని పరిస్థితుల కోడ్, 2020లను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. తప్పనిసరిగా అపాయింట్మెంట్ లెటర్స్, పీఎఫ్, ఈఎస్ఐసీ, ఇన్స్యూరెన్స్ వంటివి కల్పించాలని సూచించింది.

