ఒకే కడుపున పుట్టి.. ఒకేసారి కాటికి.. పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు..

ఒకే కడుపున పుట్టి.. ఒకేసారి కాటికి.. పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు..

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో తాండూరుకి చెందిన దంపతులు ముగ్గురు కుమార్తెలను కోల్పోయారు. తాజాగా ఆ ముగ్గరు అక్కాచెల్లెళ్ల అంతిమ ప్రయాణం ముగిసింది. కలిసి మొదలు పెట్టిన వారి ప్రయాణం.. కలిసే కాటికి చేరింది. కుటుంబానికి అంతులేని కన్నీరు మిగిలింది.

ఆ తల్లిదండ్రుల ఆక్రందన గురించి వర్ణించడం కూడా అసాధ్యం… కడుపున పుట్టిన ముగ్గురు బంగారు తల్లుల్ని ఒక్కసారే కాటికి పంపడం.. అస్సలు ఊహించతరమా. తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. అప్రయత్నంగానే కళ్ల వెంట నీరు కారుతుంది. ఎదుటపడితే ఆ దేవుడ్ని కూడా కొట్టాలన్నంత కోపంగా ఉంది.. మనకే ఇలా ఉంటే.. ఆ కుటుంబ వేదనను ఊహించగలమా…! రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. తాండూరు పట్టణంలోని గాంధీనగర్‌ ప్రాంతానికి చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు బిడ్డలు అసువులు బాశారు. అక్కాచెల్లెళ్లు తనూష, సాయి ప్రియ, నందినిలను ఈ ప్రమాదం మింగేసింది. తన ముగ్గురు బిడ్డలు ఇక లేరని తెలిసి ఆస్పత్రి వద్ద తల్లి అంబిక వెక్కి వెక్కి ఏడ్వడం చూసి అక్కడున్న వారంతా కంటతడి పెట్టారు. జీవితంలో వారు ఉన్నత స్థానాలకు వెళ్తారని.. ఎంతో సంబరంగా బిడ్డల పెళ్లిళ్లు చేయాలని ఆ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. మృతి చెందిన వారిలో రెండవ కుమార్తె తనూష ఎంబీఏ చదువుతోంది, మూడో కూతురు సాయిప్రియ కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్, చిన్న తనయ నందిని కూడా అదే కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఇటీవల గ్రామంలో బంధువుల వివాహా వేడుకకు హాజరైన వీరు.. ఆదివారం సెలవు కూడా ముగియడంతో తిరిగి కాలేజీలకు వెళ్లేందుకు పయనమై.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.

తాజాగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు ఆశ్రునయనాల మధ్య ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ల అంత్యక్రియలు ముగిశాయి. ఒకే కడుపున పుట్టి ఒకేసారి కాటికి పయనమైన ఈ ఆడబిడ్డలను చూసి యావత్ లోకం కంటతడి పెట్టుకుంది. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు దేవుడా…!

Please follow and like us:
తెలంగాణ వార్తలు