ఉపాధి హామీ పథకంలో కొత్త రూల్స్‌..! అక్టోబర్‌ 1 నుంచి ఒకరి కార్డ్‌పై మరొకరు పనికి వస్తే..

ఉపాధి హామీ పథకంలో కొత్త రూల్స్‌..! అక్టోబర్‌ 1 నుంచి ఒకరి కార్డ్‌పై మరొకరు పనికి వస్తే..

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ఉపాధి కూలీలు ఈకేవైసీ ద్వారా ఆధార్‌తో అనుసంధానం చేయబడతారు. ఒకరి బదులు మరొకరు పనిచేయడం నిరోధించబడుతుంది. అక్టోబర్ 1 నుండి ప్రయోగాత్మకంగా ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో అమలు చేయనున్నారు.

పల్లెల్లో చాలా మందికి కష్టకాలంలో ఆదుకునే పనిగా, కరువు పనిగా, మట్టిపనిగా పేరు తెచ్చుకున్న ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అక్రమాలను అరికట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలో కొంతమంది ఒకరి జాబ్‌కార్డుపై మరొకరు పని చేసేవారు. కానీ ఇకపై అలా చేయడానికి వీలు ఉండదు. ఇకపై ఉపాధి హామీ కూలీల ఈకేవైసీ తీసుకుని, ఆధార్‌తో అనుసంధానం చేస్తారు. దీనివల్ల ఒకరి బదులు మరొకరు హాజరైతే యాప్ అనుమతించదు.

అక్టోబరు 1 నుంచి ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మొదటగా ఒక్కో రాష్ట్రంలో రెండు జిల్లాలను ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఈ విధానం అమలు కానుంది. ఉపాధి హామీ పథకంలో చాలా అక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. జాబ్ కార్డు ఒకరి పేరు మీద ఉంటే, పనికి మరొకరు వస్తున్నారు. ఇలాంటి వాటిని అరికట్టడానికి ఈకేవైసీ విధానం ఉపయోగపడుతుంది. ఈ విధానం ద్వారా పనికి వచ్చే వ్యక్తి ఆధార్ నంబర్ ను నమోదు చేస్తారు. దీంతో వేరే వాళ్లు పనికి రాకుండా అడ్డుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 70.73 లక్షల జాబ్ కార్డులు జారీ చేశారు. అయితే చాలామంది జాబ్ కార్డు ఉన్నవాళ్లు ఉపాధి పనులకు రావట్లేదు. వారి బదులు వేరే వాళ్లు వస్తున్నారు. వీరు హాజరు వేయించుకుని వెళ్లిపోతున్నారు. డబ్బులు మాత్రం జాబ్ కార్డు ఉన్న వ్యక్తి ఖాతాలో జమ అవుతున్నాయి. ఆ డబ్బులను క్షేత్రస్థాయి సిబ్బంది, శ్రామికులు పంచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో కూడా గతంలో దొంగ మస్టర్ల వ్యవహారం బయటికి వచ్చింది. అందుకే కేంద్రం ఈ కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఈ కొత్త విధానం వల్ల ఉపాధి హామీ పథకంలో అవినీతి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు