పెంపుడు జంతువులను పెంచుకోవడం, వాటితో ఆడుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. అయితే వాటి నుంచి వచ్చే రేబిస్ వ్యాధి మాత్రం చాలా ప్రమాదకరం. ఒకసారి లక్షణాలు కనిపిస్తే ఈ వ్యాధి ప్రాణాంతకం అవుతుంది. అందుకే జంతువు కాటు తర్వాత రేబిస్ ప్రారంభ లక్షణాలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రేబిస్ ఒక ప్రమాదకరమైన వైరస్ వ్యాధి. ఇది నరాల వ్యవస్థపై దాడి చేస్తుంది. ఒకసారి లక్షణాలు కనిపిస్తే దాదాపు ప్రాణాంతకం. కుక్కలు, గబ్బిలాలు లేదా ఇతర జంతువులు కరవడం లేదా గోకడం ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. కొన్ని వారాల నుంచి నెలల వరకు ఈ వైరస్ శరీరంలో నిద్రాణంగా ఉంటుంది. అందుకే రేబిస్ లక్షణాలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. రేబిస్ వ్యాధిని సూచించే 6 ప్రారంభ లక్షణాలు ఇక్కడ ఉన్నాయి.
కాటు వేసిన చోట దురద, నొప్పి: రేబిస్ మొదటి లక్షణాలలో ఇది ఒకటి. కాటు లేదా గీతలు పడిన ప్రదేశంలో తిమ్మిరి, సూదులతో గుచ్చినట్లు అనిపించడం, నొప్పిగా ఉండటం లాంటివి ఉంటాయి. ఈ లక్షణాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు.
జ్వరం, ఫ్లూ లాంటి లక్షణాలు: ప్రారంభంలో రేబిస్ జ్వరం, అలసట, తలనొప్పి, ఒళ్లు నొప్పులు లాంటి ఫ్లూ లక్షణాలను పోలి ఉంటుంది. అందుకే చాలామంది వీటిని మామూలు ఫ్లూ అని భావిస్తారు. జంతువు కాటు తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
అధికంగా లాలాజలం, మింగడంలో ఇబ్బందులు: వైరస్ నరాల వ్యవస్థలో వ్యాపించడం వల్ల మింగడం కష్టంగా మారుతుంది. దీనివల్ల నోటిలో అధికంగా లాలాజలం ఊరుతుంది. నీళ్లు తాగడానికి ప్రయత్నించినప్పుడు గొంతులోని కండరాలు పక్షవాతానికి గురై, ఊపిరాడనట్లు అవుతుంది.
హైడ్రోఫోబియా (నీటి భయం): నీటిని చూసినా, దాని గురించి ఆలోచించినా భయపడటం రేబిస్ ప్రధాన లక్షణం. ఇది గొంతు కండరాలలో వచ్చే నొప్పి, పక్షవాతం వల్ల జరుగుతుంది.
గందరగోళం, ఆందోళన: వైరస్ మెదడులోకి చేరినప్పుడు, గందరగోళం, చిరాకు, ఆందోళన లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాలలో హింసాత్మకంగా ప్రవర్తిస్తారు. ఈ మానసిక మార్పులను చాలామంది మానసిక సమస్యలు అని అనుకుంటారు.
కండరాల నొప్పులు, పక్షవాతం: చివరి దశలో కండరాల నొప్పులు, ముఖ్యంగా మెడ, వెనుక భాగంలో నొప్పులు ఉంటాయి. వ్యాధి ముదిరినప్పుడు కాటు వేసిన చోటు నుండి పక్షవాతం ప్రారంభమవుతుంది. చికిత్స లేకపోతే అది ప్రాణాంతకం.
వెంటనే చికిత్స అవసరం
రేబిస్ ఒక ప్రాణాంతక వ్యాధి. అయితే లక్షణాలు కనిపించడానికి ముందు చికిత్స తీసుకుంటే దానిని వంద శాతం నివారించవచ్చు. ఒక జంతువు కాటు లేదా గీతలు పడినప్పుడు వెంటనే గాయాన్ని శుభ్రం చేసి, వైద్య నిపుణుడిని సంప్రదించాలి. సరైన సమయంలో వ్యాక్సిన్ తీసుకుంటే పూర్తి రక్షణ లభిస్తుంది.
గమనిక: ఈ కథనంలో ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. జంతువుల కాటు, గీతలు పడినప్పుడు వెంటనే వైద్య నిపుణుడిని సంప్రదించండి.