ఆపదమొక్కుల వాడికి మొక్కులు తీర్చుకునే భక్తులతో ఈ ఏడాది తిరుమల కొండ కిటికిట లాడింది. జూలై నెలలో సగటున 80వేల మంది దాకా భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఆగస్టు నెలలోనూ అదే రద్దీ కొనసాగింది. హుండీ ఆదాయం కూడా అనూహ్యంగా పెరిగింది.
తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. కలియుగంలో అపరకుభేరుడు ఆయనే. అందుకే వెంకన్న ఆదాయం కూడా ఇప్పుడు అంతకంతకు పెరుగుతోంది. తిరుమలేశుడి ఆదాయంలో హుండీ ఆదాయం కీలకంగా మారిపో తుండగా వెంకన్న ఆస్తుల విలువ కొండంత అవుతోంది. ఇప్పటికే వెల కట్టలేని ఆస్తులున్న సంపన్నుడైన శ్రీ వెంకటేశ్వరుడి ఆదాయం ఏటేటా పెరుగుతూనే ఉంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది వేసవిలో భక్తులతో కొండ కిటకిటి లాడింది. హుండీ ఆదాయం కూడా పెరిగింది. ఆగస్టు నెలలో రోజుకు సగటున దాదాపు 80 వేల మంది వరకు భక్తులు తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకోగా హుండీలో సమర్పించిన కానుకల విలువ కూడా గణనీయంగా పెరిగింది.
ఆగస్టు నెలలో మొత్తం హుండీ ఆదాయం రూ 123.43 కోట్ల మేర టీటీడీ కి వచ్చింది. 23,15,330 మంది భక్తులు వెంకన్నను దర్శించుకోగా 8,94,843 మంది భక్తులు తల నీలాలు సమర్పించారు. ఇక ఆగస్టు నెలలో 19న శ్రీవారి హుండీ ఆదాయం అత్యధికంగా రూ 5.30,19,700 రాగా ఆ రోజు శ్రీవారిని 76,033 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక ఆగస్టు నెలలో అత్యల్పంగా ఈ నెల 27 న రూ. 3.06 కోట్ల హుండీ ఆదాయం టీటీడీ ఖాతాకు జమైంది. 27 న 77,185 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 23,098 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
మరోవైపు ఆగస్టు నెలలో అత్యధికంగా 16న 87,759 భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, అత్యల్పంగా ఆగస్టు 28న 63,843 మంది భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకున్నారు. మొత్తంగా ఆగస్టు నెలలో 23,15,330 మంది భక్తులకు టిటిడి శ్రీవారి దర్శన భాగ్యం కల్పించింది. 8,94,843 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్టు టీటీడీ లెక్కలు చెబుతున్నాయి. ఇలా ఆగస్టు నెలలో తిరుమల యాత్రకు వచ్చిన భక్తులకు టిటిడి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలందించింది.