భక్తులను ముగ్ధులను చేస్తున్న ఈఫిల్ టవర్ వినాయక మండపం.. ఎక్కడో తెలుసా?

భక్తులను ముగ్ధులను చేస్తున్న ఈఫిల్ టవర్ వినాయక మండపం.. ఎక్కడో తెలుసా?

వినాయకచవితి వచ్చిందటే చాలు వీధివీధినా రకరకాల గణనాథుడి విగ్రహాలు దర్శనమిస్తాయి. ప్రతి వీధిలో విభిన్న రకాల వినాయకులు కనువిందు చేస్తాయి. విగ్రహాలను ప్రతిష్టించేందుకు నిర్వాహకులు మండపాలను ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ అలంకరణలు జనాలను ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. అయితే విజయనగరం జిల్లాలో నిర్మించిన డెబ్బై అడుగుల ఎత్తున ఈఫిల్ టవర్ వినాయక మండపం కూడా ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తుంది.

విజయనగరం జిల్లా రాజాం మున్సిపాలిటీలోని పొనుగుటివలస గ్రామం వినాయకచవితి ఉత్సవాలకు ప్రసిద్ధి. ఈ గ్రామస్తులు నిర్వహించే వినాయకచవితి ఉత్తరాంధ్రలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎందుకంటే ఈ గ్రామస్తులు వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం వినూత్న మండపాలతో భక్తులను ఆశ్చర్యపరుస్తారు. గత సంవత్సరాల్లో జల వినాయక మండపం, టైటానిక్ షిప్ నమూనా, చంద్రయాన్-2 రాకెట్ మోడల్ వంటి అద్భుత నిర్మాణాలు చేశారు. జల వినాయక మండపం అంటే నీటి మధ్యలో గణేశుడిని ప్రతిష్ఠించి భక్తులు బోట్లలో వెళ్లి దర్శనం చేసుకునేలా రూపొందించారు. టైటానిక్ షిప్ మండపం సముద్ర యాత్రలా అనిపించేలా లైటింగ్‌తో అలంకరించారు.చంద్రయాన్-2 రాకెట్ నమూనా ఇస్రో మిషన్‌ను గుర్తుచేస్తూ అంతరిక్ష థీమ్‌తో ఆకట్టుకుంది.

ఈ క్రమంలోనే ఈ ఏడాది తయారు చేసిన ఈఫిల్ టవర్ మండపం కూడా రాత్రి సమయంలో లైట్లతో మెరుస్తూ ప్యారిస్‌లోని టవర్‌ను తలపిస్తూ అందరినీ ఆకర్షిస్తుంది. ఫ్రాన్స్‌లోని ప్రసిద్ధ ఈఫిల్ టవర్‌ను అనుసరించి రూపొందించిన ఈ మండపం స్క్రాప్ మెటీరియల్‌తో తక్కువ బడ్జెట్‌లో తయారు చేశారు. ఇనుము రాడ్లు, పాత మెటల్ షీట్లు, రీసైకిల్ చేసిన పదార్థాలతో ఈ నిర్మాణం సాగింది. గ్రామస్థులు రాత్రింబవళ్లు కష్టపడి వినూత్న డిజైన్‌తో ఈ మండపాన్ని సిద్ధం చేశారు.

ఈ టవర్ క్రింద ఉయ్యాల ఊగుతున్న వినాయకుడిని ఏర్పాటు చేశారు. గ్రామ యువత ఆధ్వర్యంలో నిర్మించిన ఈ 70 అడుగుల ఈఫిల్ టవర్ ఆకారంలోని వినాయక మండపంలో ఆసీనులైన వినాయకుడిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ప్రతి ఏటా జరిగే వినాయక చవితిని గ్రామయువత అయిన రాజేష్, సురేష్, రాముతో పాటు మరికొందరు ఈ ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహిస్తారు.

తమ గ్రామ ప్రత్యేకతను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే తక్కువ ఖర్చుతో పర్యావరణ హితంగా స్క్రాప్ మెటీరియల్ ఉపయోగించి ఈ ఈఫిల్ టవర్ నిర్మాణం చేశామని తెలియజేశారు గ్రామయువకులు. మండపం లోపల గణేశుడి విగ్రహం ప్రతిష్ఠించి, పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులు, ఈ వినూత్న డిజైన్‌ను చూసి ముగ్ధులవుతున్నారు. పిల్లలు, యువత ఫోటోలు దిగుతూ సంబరాలు చేసుకుంటున్నారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు