ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం కేంద్రానికి చేరింది. గోదావరి, కృష్ణా నదుల జలాల పంపకం, బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు కేంద్రం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో జల వివాదానికి శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల జల జగడం ఢిల్లీకి చేరింది. ఏపీ, తెలంగాణ సీఎంలతో భేటీ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి ఈసారైనా గోదావరి, కృష్ణా జలాల లెక్కలు తేలేనా? బనకచర్ల భవిష్యత్ ఎలా ఉండబోతుంది? బేసిన్లు, భేషజాలకు పోకుండా చర్చిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నీటి పంచాయితీకి ఫుల్ స్టాప్ పెట్టేందుకు సిద్ధమైంది కేంద్రం. రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాలు, వినియోగంపై చర్చించేందుకు హై లెవల్ మీటింగ్ ఏర్పాటు చేసింది. రేపు మధ్యాహ్నం రెండున్నరకు ఈ భేటీ జరగబోతుంది. ఏపీ, తెలంగాణ సీఎంలు తమ డెలిగేషన్‌తో పాటు అజెండాతో రావాలని సమాచారం ఇచ్చింది కేంద్ర జలశక్తి శాఖ. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఢిల్లీలోనే ఉన్నారు. ఇవాళ ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. బనకచర్లపై చర్చించేందుకు.. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో కూడా సమావేశం కానున్నారు. ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా కేంద్రమంత్రి ఆహ్వానించడంతో ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్తున్నారు. సీఎం వెంట ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్, పలువురు ఉన్నతాధికారులు వెళ్తున్నారు. బుధవారం శ్రమశక్తి భవన్‌లో ఈ మీటింగ్ జరగనుంది.
గోదావరి-కృష్ణాలను కలిపే.. బనకచర్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన ప్రపోజల్స్ కేంద్రానికి పంపగా తెలంగాణ ఫిర్యాదుతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ సెంట్రల్ వాటర్ కమిషన్ ఏపీ ప్రపోజల్స్‌ను తిప్పి పంపింది. దీంతో కేంద్ర సంస్థ వ్యాప్కోస్‌తో సర్వే చేయించిన ఏపీ సర్కార్, ఆ రిపోర్ట్‌ను కేంద్రం ముందు ఉంచేందుకు సిద్ధమైంది. బనకచర్ల ద్వారా కేవలం మిగులు జలాలు, సముద్రంలోకి వెళ్లే వృధా నీటినే 200 టీఎంసీలను వాడుకుంటామని చంద్రబాబు ప్రభుత్వం ముందు నుంచి చెబుతోంది. దీనిపైనే తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది. ముందు 2 రాష్ట్రాల కేటాయింపులు, ప్రాజెక్టులు పూర్తి చేసుకుని ఆ తర్వాత మిగులు జలాలపై మాట్లాడదాం అంటోంది. అప్పటివరకు బనకచర్ల అంశం పక్కనపెట్టాలని కేంద్రానికి సూచిస్తుంది. బనకచర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఇప్పటికే కేంద్రానికి చాలాసార్లు ఫిర్యాదు చేయడంతో ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపైనే కేంద్ర మంత్రి మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
బేసిన్లు, భేషజాలు లేకుండా రెండు రాష్ట్రాల సీఎంలు చర్చిస్తారా? జల జగడానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పటికే రెండు నదుల్లో నీటి వాటాలు, ప్రాజెక్టులపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకు ఏపీ సీఎం చంద్రబాబు కూడా అంగీకరించారు. ఇక రేపటి భేటీలో ఏం తేలుస్తారు? కృష్ణా, గోదావరి నీళ్లపై ఇద్దరు సీఎంలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? రేపటితోనైనా నీళ్ల పంచాయతీకి ఎండ్ కార్డ్ పడుతుందా లేదా చూడాలి.