శ్రీవారి భక్తులకు మరో గుడ్ న్యూస్ అందించింది టీటీడీ. సరికొత్త ప్రయత్నంలో భాగంగా ఇకపై పుస్తక ప్రసాదాన్ని అందించనుంది. మతమార్పిడిలను సమూలంగా అరికట్టి సనాతన ధర్మాన్ని చాటి చెప్పేలా టీటీడీ ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుమల శ్రీవారి వైభవాన్ని చాటి చెప్పడంతో పాటు సనాతన ధర్మ పరిరక్షణకు టిటిడి పుస్తక ప్రసాదాన్ని అందుబాటులోకి తెచ్చింది. శ్రీవారి భక్తులకు ఇకపై పుస్తక ప్రసాదం చేయనుంది. మతమార్పిడిలను సమూలంగా అరికట్టి సనాతన ధర్మాన్ని చాటి చెప్పేలా టీటీడీ చర్యలు చేపట్టింది. సనాతన ధర్మ వైభవం, విశిష్టతపై అవగాహన కలిగించేందుకు పుస్తక ప్రసాదం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సూచనలతో పుస్తక ప్రసాదం కార్యక్రమాన్ని విసృత్తంగా చేపట్టబోతోంది హిందూ ధర్మ ప్రచార పరిషత్. దళిత వాడలు, మారుమూల కుగ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉచితంగా పుస్తకాల పంపిణీ చేయబోతోంది. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లలోనూ నిరంతరం భక్తులకు పుస్తకాల వితరణ చేయబోతోంది. ఈ మేరకు భక్తులకు ఇచ్చే పుస్తకాలను అధికారులకు అందచేసారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.
దేవదేవుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవాన్ని విస్తృతస్థాయిలో ప్రచారం చేయడం లక్ష్యంగా టిటిడి ఈ ప్రయత్నం చేస్తోంది. హిందూమతం నుంచి అన్యమతంలోకి జరుగుతున్న మతమార్పిడిలను అరికట్టాలని భావిస్తోంది. ధర్మప్రచార పరిషత్‌పై ఇటీవల జరిగిన సమావేశంలో పుస్తకప్రసాదం అనే కాన్సెప్ట్‌ను తీసుకురావాలని టీడీడీ నిర్ణయం తీసుకుంది. దళిత వాడలు, మారుమూల కుగ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు సనాతన ధర్మం ప్రాధాన్యత, శ్రీవారి వైభవం, హిందూ సంప్రదాయం, మహా పురుషుల చరిత్రకు సంభందించిన పుస్తకాలను టీటీడీ పంపిణీ చేయబోతుంది. తిరుమల క్యాంప్ కార్యాలయంలో పుస్తక ప్రసాదంగా పంపిణీ చేయబోయే శ్రీవెంకటేశ్వర వైభవం, విష్ణు సహస్రనామం, వెంకటేశ్వర సుప్రభాతం, భజగోవిందం, లలితా సహస్రనామం, శివ స్తోత్రం, భగవద్గీత, మహనీయుల చరిత్ర, తదితర పుస్తకాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు ధర్మప్రచార పరిషత్ అధికారులు అందజేశారు.
టీటీడీ నిధులను వినియోగించకుండా పుస్తక ప్రసాదం పంపిణీకి టిటిడి చర్యలు చేపట్టింది. భక్తులకు అందించే పుస్తకాలను ముద్రించేందుకు అయ్యే ఖర్చును భరించేందుకు అనేకమంది దాతలు ముందుకు వచ్చారని పేర్కొంది. దాతల సహకారంతో హ్యాండ్ బుక్స్‌ను ముద్రించి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా ముందుగా తెలుగు రాష్ట్రాలలో పంపిణీ చేయనుంది. ఆ తరువాత అన్ని భాషల్లో ముద్రణలు చేసి దేశవ్యాప్తంగా పుస్తక ప్రసాదం కార్యక్రమాన్ని తీసుకెళ్లి హిందూ ధర్మ వైభవాన్ని చాటి చెప్పి, మతమార్పిడిలను అరికట్టేలా చర్యలు చేపట్టాలని అధికారులను అదేశించారు టిటిడి చైర్మన్.