తిరుమల శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు వడలు ఇప్పుడు రెండు పూటలపాటు అందిస్తున్నారు. ఈ విధంగా ప్రతి రోజు 70,000 నుండి 75,000 వడలు అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అందుతున్నాయి. పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం పదండి..
తిరుమలలోని శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు వడలు ఇప్పుడు రెండు పూటలపాటు అందిస్తున్నారు. జులై 7 నుండి సాయంత్రం సెషన్లో కూడా వడలను టీటీడీ భక్తులకు వడ్డిస్తోంది. మార్చి 6 నుంచి మధ్యాహ్న సమయంలో అన్నప్రసాదంలో వడను ఇస్తున్నారు. ఇప్పుడు రాత్రి భోజన సమయంలో కూడా అందుబాటులోకి వచ్చింది.
మార్చి 6 నుంచి రోజుకు 30,000 నుండి 35,000 వడలు మధ్యాహ్న భోజనంలో అందిస్తున్నారు. ఇప్పుడు సాయంత్రం భోజనంలో కూడా 35,000 వడలను భక్తులకు వడ్డిస్తున్నారు. ఈ విధంగా ప్రతి రోజు 70,000 నుండి 75,000 వడలు అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అందుతున్నాయి. సాయంత్రం వడ పంపిణీ కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు స్వయంగా ప్రారంభించారు.
అన్నప్రసాద భవనంలో స్వామి అమ్మవార్ల చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత.. టీటీడీ చైర్మన్ వడలను భక్తులకు వడ్డించారు. ఈ వడలను శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, సోంపు వంటి పదార్థాలతో రుచికరంగా తయారు చేస్తున్నారు. ఈ కొత్త మార్పు ద్వారా, టీటీడీ ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వడలను భక్తులకు వడ్డించనుంది. ఈ నిర్ణయంతో తిరుమలలో భక్తులకు నాణ్యతతో కూడిన, రుచికరమైన అన్నప్రసాదం అందించే లక్ష్యంతో టీటీడీ పని చేస్తోంది.
అన్నప్రసాదం వడ రుచి గురించి భక్తుల నుంచి సంతృప్తికరమైన స్పందనలు వస్తున్నాయని టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు చెప్పారు. కొత్త పాలక మండలి ఏర్పడిన తర్వాత, భక్తులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. భోజన నాణ్యతను మెరుగుపర్చే దిశగా ఈ చర్యలు కొనసాగుతాయని టీటీడీ చైర్మన్ తెలిపారు.