దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచుల్లో.. రెగ్యులర్ ప్రాతిపదికన లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 2,500 పోస్టులను భర్తీ చేయనుంది..
బ్యాంక్ ఆఫ్ బరోడా.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బ్రాంచుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 2,500 పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో గుజరాత్ రాష్ట్రంలో 1160 పోస్టులు, కర్ణాటక రాష్ట్రంలో 450 పోస్టులు, మహారాష్ట్ర రాష్ట్రంలో 485 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఒక్క అభ్యర్థి ఒక రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేయవల్సి ఉంటుంది. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సీఏ, కాస్ట్ అకౌంటెంట్, ఇంజినీరింగ్, మెడికల్ వంటి ప్రొఫెషనల్ డిగ్రీలు చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తుదారులకు కమర్షియల్ బ్యాంక్ లేదా రిజినల్ రూరల్ బ్యాంకులో కనీసం ఏడాదిపాటు బ్యాంకింగ్ అనుభవం ఉండాలి. అలాగే అభ్యర్థుల వయస్సు తప్పనిసరిగా జులై 1, 2025 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు ఐదేళ్లు, ఓబీసీ కేటగిరీకి 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ కేటగిరీకి 15 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తుదారుల కనీస సిబిల్ స్కోరు తప్పనిసరిగా 680 వరకు ఉండాలి.
ఆన్లైన్ దరఖాస్తులు జులై 4 నుంచి ప్రారంభమవుతాయి. దరఖాస్తు, ఫీజు చెల్లింపులను జులై 24, 2025వ తేదీ వరకు స్వీకరిస్తారు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం, మహిళా అభ్యర్థులు రూ.175 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఆన్లైన్ రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, లాంగ్వేజ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.48,480 నుంచి రూ.85,920వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. ఆన్లైన్ రాత పరీక్ష.. ఇంగ్లీష్, బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.