పండ్లలో ఎక్కువగా నీరు, రకరకాల సహజ చక్కెరలు, పీచు పదార్థాలు ఉంటాయి. అందుకే అవి రక్తంలో చక్కెర స్థాయిలపై పెద్దగా ప్రభావం చూపవు. అయితే పండ్లను ఎప్పుడు, ఎలా తినాలో చాలా మందికి సందేహాలు ఉంటాయి. ఈ విషయంపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పండ్లలో 80 శాతం నీరు, ఫ్రక్టోజ్, గ్లూకోజ్, సుక్రోజ్, శరీరానికి కావాల్సిన పీచు పదార్థం, పాలిఫినాల్స్ ఉంటాయి. ఇవి మన రక్తంలో చక్కెరను నెమ్మదిగా, తక్కువగా పెంచుతాయి. అందుకే పూర్తిగా సహజమైన పండ్లు తినడం మధుమేహ రోగులకు కూడా సురక్షితం. పండ్లలో ఉండే ఫ్రక్టోజ్ శరీరంలో ఇన్సులిన్ స్థాయిని వెంటనే పెంచదు. అది కాలేయంలో మారుతుంది. గ్లూకోజ్ రక్త చక్కెరను పెంచుతుంది.. కానీ పండ్లలోని పీచు పదార్థంతో కలిసి ఉండటం వల్ల అది ఆహార నాళాల్లో నెమ్మదిగా విడుదలై రక్తంలో చక్కెర పెరగడాన్ని నియంత్రిస్తుంది.
అంతేకాదు సహజంగా ఉండే పండ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర క్రమంగా కొంత పెరిగి రెండున్నర గంటల్లో మళ్లీ మామూలుగా తగ్గిపోతుంది. ఈ కారణంగా ఖాళీ కడుపుతో పండ్లు తినడం డయాబెటిస్ ఉన్నవారికి ప్రమాదకరం కాదు.
పండ్లపై అపోహలు, నిజాలు
పండ్లు మన పొట్టలోని మంచి బ్యాక్టీరియా (గట్ ఫ్లోరా)ను నాశనం చేస్తాయని అనుకోవడం తప్పు. పండ్లలోని పీచు పదార్థాలు, పాలిఫినాల్స్, షార్ట్ చెయిన్ ఫ్యాటీ యాసిడ్లు పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గట్ ఫ్లోరాకు హానికరమైనవి అధిక మోతాదులో మద్యం, ఎక్కువ యాంటీబయోటిక్స్, కీమోథెరపీ మాత్రలు మాత్రమే.
పండ్లు నెమ్మదిగా జీర్ణం అవుతాయని.. రక్త చక్కెరను వేగంగా పెంచవని చాలా మందికి సరిగా అర్థం కాదు. నిజానికి పండ్లు తక్కువ సమయంలోనే జీర్ణం అవుతాయి. వాటిలోని పీచు పదార్థం రక్తంలో చక్కెర పెరగడాన్ని అతి వేగంగా కాకుండా.. నియంత్రణలో ఉంచుతుంది. రోజుకు సుమారు 250 గ్రాముల సహజ పండ్లు తినడం మధుమేహం వంటి రోగాల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. పండ్లు తినడమే కాకుండా.. మధుమేహం రావడానికి మన జీవనశైలిలోని కొన్ని అంశాలు కూడా చాలా ముఖ్యమైనవి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆహారం తిన్న తర్వాత చక్కెర స్థాయి ఎక్కువగా ఉండటం
రోజంతా అధిక క్యాలరీలు తీసుకోవడం
కొవ్వు ఎక్కువగా ఉండే.. ప్రాసెస్ చేసిన చక్కెర కలిగిన ఆహారాలను ఎక్కువగా తినడం
శారీరక వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం
నిద్రలేమి లేదా నిద్ర సమస్యలు
పొట్ట చుట్టూ, లోపలి అవయవాల చుట్టూ కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం
అధిక బరువు
మానసిక ఒత్తిడి
ఈ కారణాలన్నీ కలిపి మధుమేహానికి దారితీస్తున్నాయి.
పండ్లతో మధుమేహం నియంత్రణ
పండ్లలోని పీచు పదార్థం, విటమిన్లు, సహజ చక్కెరలు మధుమేహం నియంత్రణలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో, శరీరానికి శక్తిని ఇవ్వడంలో, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ విధంగా పండ్లను సరైన సమయానికి, సరైన పరిమాణంలో తీసుకోవడం ద్వారా మధుమేహ రోగులు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)