ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అధికారంలోకి వస్తే టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని హామి ఇచ్చింది. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ సర్కార్ ఈ స్కీమ్‌పై కసరత్తు చేసింది. ఈ తరహా పథకాలు అమలు చేస్తోన్న కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఏపీ మంత్రులు, అధికారులు పర్యటించి పూర్తి వివరాలు సేకరించారు.
ఏపీలో మహిళలకు సర్కార్ వారి శుభవార్త. 2025 ఆగస్టు 15 నుంచి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తున్నట్లు కర్నూలు పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
మహిళల సామాజిక, ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రోత్సహించడం, రవాణా ఖర్చులను తగ్గించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వస్తే రోజుకు సుమారు 25 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందవచ్చని అధికారులు చెబుతున్నారు.